13-09-2025 02:56:00 AM
బీఆర్‌ఎస్ పార్టీలోనే ఉన్నాం..
మా ఫొటోల మార్ఫింగ్ జరిగింది
హైదరాబాద్, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ నుంచి పోటీ చేసి, గెలిచిన ఆ తర్వాత 10 ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ పార్టీలో చేరారని బీఆర్‌ఎస్ సుప్రీం కోర్టు ఆశ్రయించిన కేసులో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకున్నది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఇటీవల 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వగా, వారిలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మినహా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, జగిత్యాల- ఎమ్మెల్యే సంజయ్, పటాన్‌చెరు ఎమ్మెల్యే- గూడెం మహిపాల్‌రెడ్డి, చేవెళ్ల -ఎమ్మెల్యే కాలె యాదయ్య, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే- ప్రకాశ్ గౌడ్, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, బాన్సువాడ- పోచారం శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం స్పీకర్‌కు లిఖితపూర్వకమైన వివరణ ఇచ్చారు.
తాము ఏ పార్టీలోనూ చేరలేదని, బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్నామని, తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల అభివృద్ధి గురించి చర్చించేందుకే సీఎం రేవంత్‌రెడ్డిని కలిశామని స్పష్టం చేశారు. తాము పార్టీ మారినట్లుగా తప్పుడు ప్రచారం చేసే ందుకు కొందరు తమ ఫొటోలను మార్ఫి ంగ్ చేశారని వివరణలో పేర్కొన్నారు.
బీఆర్‌ఎస్ వద్ద కీలక ఆధారాలు..
ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడి యం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై మాత్రమే అనర్హత వేటు పడే ఛాన్స్ ఉందన్న చర్చ ప్రస్తుతం జోరుగా సాగుతున్నది. వీరు పార్టీ ఫిరాయించినట్లు బీఆర్‌ఎస్ వద్ద బలమైన ఆధారాలు ఉన్నాయని, మిగతా వారికి సంబంధించి అంతకచ్చితమైన ఆధారాలేవీ ఉండకపోవచ్చని కొందరు భావిస్తున్నారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు.
ఎంపీ ఎన్నికల సందర్భంగా కడియం శ్రీహరి తన కూతురు, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కావ్యను గెలిపించాలని విస్తృత ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చేయి గుర్తుకు ఓటు వేసి తన కుమార్తె కావ్యను గెలిపించాలని అనేక సభల్లో కోరారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకోసం పనిచేసిన అనేక వీడియోలు బీఆర్‌ఎస్ వద్ద ఉన్నాయి. ఈ ఆధారాలతో ఈ ముగ్గురిపై వేటు ఖాయమన్న చర్చ సాగుతోంది.
సీఎం దిశానిర్దేశం..
ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరికి సంబంధించి బీఆర్‌ఎస్ వద్ద కీలకమైన ఆధారాలు ఉన్న నేపథ్యంలో మిగతా ఏడుగురు ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలని కాంగ్రెస్ సీనియర్లు సూచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేయడం ఈ వాదనలకు బలాన్నిచ్చింది. సీఎం ఈ సమావేశంలోనే సదరు ఎమ్మెల్యేలకు ప్రభుత్వ కార్యక్రమాల్లో తప్ప పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనొద్దని సూచించినట్లు తెలిసింది.
బీఆర్‌ఎస్ జారీ చేసే విప్‌లను పాటించాలని కూడా సీఎం ఆదేశించినట్టు సమాచారం. అవసరం వచ్చిన ప్పుడల్లా తాము బీఆర్‌ఎస్‌లోనే ఉన్నామని చెప్పాలని సూచిస్తున్నట్లు తెలు స్తోంది. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు ఆ సూచనలను తుచ తప్పకుండా ఫాలో అవుతున్నారని సమాచారం. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి ఏకంగా తన ఫొటోలను కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీల్లో ఉండటాన్ని వ్యతిరేకిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తాను బీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసి గెలిచానని కూడా ఉద్ఘాటించడం గమనార్హం.
దిక్కుతోచని స్థితిలో ఎమ్మెల్యేలు..
2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత పది మంది ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారని, అందుకే వారంతా సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారని, ఇక వారు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతారని విస్తృతంగా కథనాలు వచ్చాయి. తర్వాత బీఆర్‌ఎస్ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో స్పీకర్ చివరకు సదరు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయాల్సి వచ్చింది.
నోటీసులకు ఇద్దరు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి తప్ప మిగతా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్నామని వివరణ ఇవ్వడం గమనార్హం. మరోవైపు న్యాయస్థానానికి ఇప్పటికే బీఆర్‌ఎస్ సమర్పించిన వీడియోలు, ఫొటోల వంటి ఆధారాలతో ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే అవకాశం ఉంది. వారిపై అనర్హత వేటు పడితే ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే సదరు ఎమ్మెల్యేలంతా బీఆర్‌ఎస్‌లోనే ఉన్నామని స్పీకర్‌కు వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది.
బీఆర్‌ఎస్ న్యాయపోరాటం..
ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయం తేల్చేందుకు బీఆర్‌ఎస్ న్యాయపోరాటం దిశగా అడుగులు వేస్తున్నది. ఎమ్మెల్యేల వివరణ, స్పీకర్ నిర్ణయం తమకు అనువుగా రాని పక్షంలో పార్టీ మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించాలని పట్టుదలతో ఉన్నట్టు సమాచారం. పేరుమోసిన అడ్వొకేట్లను రంగంలోకి దించి న్యాయం సాధించాలనే పట్టుదలతో పార్టీ ఉన్నట్లు తెలిసింది. మరోవైపు ఆ పది మంది ఎమ్మెల్యేల్లో కేవలం ముగ్గురిపైనే అనర్హత వేటు పడే అవకాశం ఉందనే చర్చ నడుస్తున్నది. మిగిలిన వారిపై స్పీకర్ సానుకూలంగా స్పందించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఏదిఏమైనా స్పీకర్ ఈ విషయంలో తక్షణ నిర్ణయం తీసుకోకపోతే బీఆర్‌ఎస్ మళ్లీ కోర్టును ఆశ్రయించే అవకాశం కనిపిస్తున్నది. కోర్టు మళ్లీ స్పీకర్‌కు నోటీసులు జారీ చేసే అవకాశం కనిపిస్తున్నది. తదుపరి చర్యలకు స్పీకర్ మళ్లీ కాలయాపన చేస్తూ మరింత సమయం కోరే అవకాశమూ లేకపోలేదు. గతంలో కొన్నిరాష్ట్రాల్లోనూ ఇలాంటి దృష్టాంతాలే కనిపించాయి. బీఆర్‌ఎస్ మాత్రం కచ్చితంగా 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడాల్సిందేనని, ఆ పది నియోజకవర్గాల్లో మళ్లీ ఉప ఎన్నికలు వస్తాయనే ధీమాతో ఉంది. ఉప ఎన్నికలు వచ్చినా తమకు వచ్చే నష్టం ఏమీ లేదని, పదిచోట్ల ఎన్నోకొన్ని స్థానాలు దక్కించుకున్నా ప్రయోజనమేనని పార్టీ భావిస్తున్నది.