calender_icon.png 13 September, 2025 | 5:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానేరులో చిక్కుకున్న ఇసుక ట్రాక్టర్లు

13-09-2025 02:17:04 AM

  1. సకాలంలో స్పందించిన పోలీసులు
  2. ప్రాణాలతో బయటపడిన డ్రైవర్లు

పెద్దపల్లి, సెప్టెంబర్ 12(విజయక్రాంతి)ః మానేరు వాగులో ఇసుక కోసంవెళ్లిన ట్రాక్టర్ డ్రైవర్లు ఊహించని ప్రమాదంలో చిక్కుకున్నారు. ఒక్కసారిగా వాగు ఉప్పొంగడంతో ట్రాక్టర్లతో సహా వరదల్లో చిక్కుకొని అల్లాడిపోయారు. వాగులో చిక్కుకున్న వారిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో డ్రైవర్లు సురక్షితంగా బయటపడ్డారు. కరీంనగర్ మానేరు డ్యామ్ గేట్లు ఎత్తడంతో ఈ ప్రమాదరం జరిగింది. జయశంకర్ భూపాలపల్లి, టేకుమట్ల మండలం కలికోటపల్లి, పెద్దపల్లి జిల్లాలోని ముత్తారం మండలంలోని ఓడేడు శివారులోని మానేరు వాగు నుంచి ఇసుక రవాణా కోసం శుక్రవారం ఉదయం ౧౧ ట్రాక్టరు వెళ్లాయి.

ఇసుక తోడుతున్న క్రమంలో అకస్మాత్తుగా ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగింది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో మానేరు వాగు ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. వాగు మధ్యలో ఇసుక నింపుకున్న  ట్రాక్టర్లు వాగు దాటేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో వరద ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. దీంతో ఆ ట్రాక్టర్లు వాగు మధ్యలో చిక్కుకుపోయాయి. ట్రాలీలు బోల్తా పడడంతో డ్రైవర్లు ట్రాక్టర్లు పైకి ఎక్కి భయాందోళనలతో కేకలు వేశారు. 

సమాచారం అందుకున్న టేకుమట్ల ఎస్సై సుధాకర్, చిట్యాల సీఐ మల్లేష్, ఎస్సై శ్రవణ్‌కుమార్, తహసీల్దార్ విజయలక్ష్మి సంఘటన స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో తాళ్లు తెప్పించి వాగు ఒడ్డు దగ్గర వరదలో ఉన్న ముగ్గురు డ్రైవర్లను ఒడ్డుకు తీసుకువచ్చారు. మరో నలుగురు డ్రైవర్లు వాగు మధ్యలో ఉన్న ఎత్తున ప్రదేశానికి ట్రాక్టర్‌లో  చుట్టు వరద నీరు పెరగడంతో అక్కడే భయంతో ఉండిపోయారు.

కానిస్టేబుళ్లు మహేందర్, సతీష్ సాహసించి  వంతెన గడ్డర్ల పైకి లాగి ప్రాణాలు కాపాడారు. దీంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.     తమ ప్రాణాలను లెక్కచేయకుండా నలుగురి ప్రాణాలను కాపాడిన ఆ పోలీసులను భూపాలపల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్ పి.అశోక్‌కుమార్, ఆర్డీవో ఆర్.రవి, సీఐ మల్లేష్ సన్మానించారు.