calender_icon.png 13 September, 2025 | 5:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పట్టపగలు దోపిడీ

13-09-2025 02:41:30 AM

డ్రైవర్ కళ్లలో కారం చల్లి..

40 లక్షలతో పారిపోతుండగా కారు బోల్తా 

కారును వదిలేసి డబ్బుతో పరారైన నలుగురు దుండగులు

రంగారెడ్డి జిల్లా కొత్తపల్లి వద్ద ఘటన

చేవెళ్ల, సెప్టెంబర్ 12: కారు డ్రైవర్ కళ్లలో నలుగురు దుండగులు కారం చల్లి, దారి దోపిడీకి పాల్పడ్డారు. రూ. 40 లక్షలతో వేరే కారులో పారిపోతుండగా బోల్తా పడింది. దీంతో నిందితు లు కారును అక్కడే వదిలేసి పారిపోయారు. ఈ ఘటన శుక్రవారం రంగా రెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం కొత్తపల్లిలో జరిగింది. సీఐ శ్రీనివాస్‌గౌడ్ తెలి పిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌కు చెందిన రాకేష్ అగర్వాల్‌కు తన వ్యాపార లావాదేవీలకు సంబంధించి వికారాబాద్‌కు చెందిన ఓ కస్టమర్ రూ. 40లక్షలు ఇవ్వాల్సి ఉంది.

వాటిని తీసుకురావాలని తన వద్ద పనిచేసే సాయిబాబా, మణిని పం పారు. వాళ్లు మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో వికారాబాద్ నుంచి డబ్బులు తీసుకొని కారులో నగరానికి తిరుగు ప్రయాణమయ్యా రు. మధ్యాహ్నం 1.30 గంటల ప్రాం తంలో రంగారెడ్డి శంకరపల్లి మండల పరిధిలోని హుస్సేన్‌పూర్ గ్రామ శివా రు వద్దకు రాగానే నలుగురు దుండగులు కారులో వెంబడించి వీళ్ల కారు ను అడ్డుకున్నారు. ముఖాలకు మాస్క్ ధరించి ఉన్న దుండగులు.. కారు నడుపుతున్న మణి కంట్లో కారం చల్లి, రాయితో అద్దం పగులగొట్టారు. వెను క సీటులో కూర్చున్న సాయిబాబాపై దాడి చేసి, రూ.40 లక్షలు ఉన్న బ్యాగును తీసుకొని కారులో పారిపోయారు.

అలా పారిపోతున్న క్రమంలో వారి కారు నాలుగు కిలో మీటర్లు దాటిన తర్వాత అదే మండలం కొత్తపల్లి గ్రామ శివారులో అదుపుతప్పి కల్వర్టుకు ఢీ కొట్టి బోల్తా పడింది. దీంతో నిందితులు కారును అక్కడే వదిలేసి, డబ్బులతో పారిపోయారు. అయితే దాదాపు ౧౫ లక్షల  రూపాయలను వారు అక్కడే వదిలేసి మిగతా డబ్బుతో పారిపోయినట్టు తెలిసింది. కారు బోల్తా పడిన విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నార్సింగ్ ఏసీపీ రమణ గౌడ్, శంకర్‌పల్లి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. విచారణ లో భాగంగా క్లూస్ టీమ్ ఫింగర్ ప్రింట్స్, డాగ్స్ స్క్వాడ్ సాయంతో ఆధారాలు సేకరించారు.  సీసీఎస్,  ఎస్‌ఓటీ పోలీసులతో నాలుగు బృందాల ను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. కారు బోల్తా పడిన స్థలాన్ని పరిశీలించగా నిందితులకు సంబంధించిన కొన్ని వస్తువులు, కొంత నగదును గుర్తించామని, వాటిని సీజ్ చేసి తదుపరి విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.