13-09-2025 02:38:24 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): దక్షిణ భారత కుంభమేళాగా పేరు న్న గోదావరి పుష్కరాలకు మరో 22 నెలల వ్యవధి ఉన్నందున శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. గోదావరి తీరం వెంబడి ఉన్న ఆలయాల అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చి, సత్వరం పూర్తి చేయాలని సూచించారు. 2027 జూలై 23 నుంచి గోదావరి పుష్కరాలు జరుగనున్న నేపథ్యంలో పుష్కర ఏర్పాట్లు, ముందస్తు సన్న ద్ధతపై శుక్రవారం హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం మాట్లాడారు.
పనులు పూర్తి చేసేందుకు ముందస్తు ప్రణాళికలు అవసరమని, భక్తుల రద్దీని అంచనా వేసుకొని ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా ఏర్పాట్లు ఉండాలని సూచించారు. రాష్ట్రంలో 560 కిలోమీటర్ల మేర గోదావరి తీర ప్రాంతం ఉందని, ఆయా తీర ప్రాంతాల్లో 74 చోట్ల పుష్కర ఘాట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. బాసర నుంచి భద్రాచలం వరకు తీరం వెంట ఉన్న ధర్మపురి, కాళేశ్వరంతో పాటు అన్ని ప్రధాన ఆలయాలను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ఆలయ కమిటీలు, అధికారులతో చర్చించి అక్కడ అవసరమైన ఏర్పాట్ల ప్రణాళిక రూపొందించాలని సూచించారు.
సౌకర్యాల కల్పనకు గతంలో అనుభవం ఉన్న కన్సల్టెన్సీలను నియమించుకోవాలని ఆదేశించారు. ఆలయాలన్నింటినీ సందర్శించి విడివిడిగా ప్రాజెక్టు రిపోర్టులు సిద్ధం చేసుకోవాలని దిశా నిర్దేశం చేశారు. ప్రస్తుతం ఉన్న ఘాట్లను విస్తరించడంతో పాటు రోడ్లు, ఇతర సౌకర్యాలను శాశ్వత ప్రాతిపదికన చేపట్టాలన్నారు. పుష్కర ఘాట్ల అభివృద్ధి పనులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. రెండో ప్రాధాన్యంగా పుష్కర స్నానాలకు వీలుగా ఉండే తీర ప్రాంతాలను అభివృద్ధి చేయాలని దిశానిర్దేశం చేశారు. ఒకే రోజు రెండు లక్షల మంది భక్తులు పుష్కర ఘాట్లకు తరలివచ్చినా, ఘాట్ల వద్ద భక్తులకు ఇబ్బందుల్లేకుండా చూడాలని సూచించారు.
వాహనాల పార్కింగ్, తాగునీటి వసతి, స్నాన ఘాట్ల వద్ద మౌలిక వసతులు కల్పించాలన్నారు. స్థానిక పరిస్థితులు, సెంటిమెంట్లకు అనుగుణంగా ఆలయాల అభివృద్ధి ఉండాలని ఆకాంక్షించారు. ఏర్పాట్లకు కేంద్రం ప్రభుత్వ ప్రాయోజిత పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. స్వచ్ఛ భారత్, జల్ జీవన్ మిషన్‌తో పాటు అందుబాటులో ఉన్న కేంద్ర పథకాలన్నింటితో సమన్వయం ఉండేలా చూసుకోవాలన్నారు. కేంద్రం నుంచి స్పెషల్ ప్యాకేజీ కోరేందుకు వీలుగా పనుల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు.
పర్యాటక, నీటి పారుదల, దేవాదాయ శాఖలు సమన్వయంతో పని చేసి పుష్కరాలను విజయవంతం చేయాలని సూచించారు. సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్, సీఎంవో ముఖ్యకార్యదర్శి శేషాద్రి, సీఎం ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, ధార్మిక సలహాదారు గోవింద హరి పాల్గొన్నారు.