calender_icon.png 13 September, 2025 | 5:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వణుకుతున్న శివారు కాలనీలు

13-09-2025 02:20:00 AM

-లోతట్టు ప్రాంతాల్లో పూర్తి కానినాలాలు, బాక్స్ డ్రైన్, ట్రంక్ లైన్ పనులు 

-భారీ వర్షాలు కురిస్తే నీట మునుగుతున్న కాలనీలు 

-శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజల వినతి 

ఎల్బీనగర్, సెప్టెంబర్ 12 : వానాకాలం వస్తే ఎల్బీనగర్ నియోజకవర్గం వణికిపోతోంది. శివారు ప్రాంతాల ప్రజలు భయం గుప్పిట్లో ఉంటున్నారు. వరద తాకిడికి పలు కాలనీలు నీట మునుగుతుండడంతో ఇండ్లలోకి నీరు చేరుతుంది. హయత్ నగర్, వనస్థలిపురం, బీఎన్ రెడ్డి, నాగోల్, కొత్తపేట, చైతన్యపురి, గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలోని పలు కాలనీలు ముంపు ప్రాంతాలుగా ఉన్నాయి. ఆయా కాలనీల ప్రజలు వానొస్తే భయంభయంగా ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

ఆయా కాలనీల్లో ప్రారంభించిన నాలాల నిర్మాణాలు, బాక్స్ డ్రైన్లు, ట్రంక్ లైన్ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో వరద వెళ్లాల్సి దారులన్నీ మూసుకొని పోవడంతో నీరంతా లోతట్టు ప్రాంతాల్లోకి చేరి, ఇండ్లలోకి చేరుతుంది. అసంపూర్తిగా పనులతో ముంపు సమస్య తీరకపోగా.. మరింత ప్రమాదకరంగా మారింది. ఆయా డివిజన్లలో వరద ముంపు పనులు, డ్రైనేజీ పనులు పూర్తి కాకపోవడంతో భారీ వర్షాలకు చాలా ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి.

శివారు ప్రాంతాలు, లోతట్టు కాలనీల్లో ముంపు నివారణకు ట్రంక్ లైన్, బాక్స్ డ్రైన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులన్నీ వానాకాలం రాకముందే పూర్తి చేయాలి, కానీ అధికారుల పర్యవేక్షణ లోపం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో  అసంపూర్తిగా ఉంటున్నాయి. వరదలు వచ్చినప్పుడే ప్రజాప్రతినిధులు, అధికారులు వస్తారని... ఆ తర్వాత సమస్యలను మరిచిపోతారని ముంపు ప్రాంతాల ప్రజలు విమర్శిస్తున్నారు. పనులు పూర్తి కాకపోవడంతో ముంపు సమస్య అధికంగా ఉంటుందని తెలిపారు. - 

పూడిపోయిన కల్వర్టులు, వరద కాల్వలు

ఎల్బీనగర్ నియోజకవర్గంలోని ఆయా డివిజన్లలో ఉన్న కల్వర్టులు, వరద కాల్వలు ఆక్రమణలకు గురయ్యాయి. చెరువులోకి వరద చేరడానికి నిర్మించిన కల్వర్టులు, వరద కాల్వలు, నాలాలు పూర్తిగా ధ్వంసమయ్యా యి. దీంతో భారీ వర్షాలు కురిసినప్పుడు వాన నీరు లోతట్టు ప్రాంతాల్లోకి చేరుతుం ది. ముఖ్యంగా విజయవాడ జాతీయ రహదారి పూర్తి జలదిగ్బంధంలో ఉంటుంది.

దీంతో వాహనాలు ఎక్కడిక్కడ నిలిచి పోవడంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రాచకాల్వ కనుమరుగయ్యే పరిస్థితి నెలకొనడంతో పలు కాలనీలను వరద ముంచెత్తుతోంది. చాపల చెరువు, బాతుల చెరువు, కుమ్మరి కుంట, మన్సూరాబాద్ లోని పెద్ద, చిన్న చెరువులోకి వరద చేరడానికి నిర్మించిన కల్వర్టులు, వరద కాల్వలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఫలితంగా భారీ వర్షాలు కురిసినప్పుడు సైతం చెరువులు నిండడం లేదు. ఆయా చెరువుల్లో ఉన్న నీరంతా మురుగు నీరే అధికంగా చేరుతుంది. 

 నీటి మునుగుతున్న శివారు కాలనీలు 

గురువారం కురిసిన భారీ వర్షానికి హయత్ నగర్, బీఎన్ రెడ్డి, వనస్థలిపురం, మన్సూరాబాద్ డివిజన్లు వణికిపోయాయి. పలు శివారు ప్రాంతాలు నీట మునిగాయి. బీఎన్‌రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని సాహెబ్ నగర్ కలాన్, పీవీఆర్ కాలనీ, పద్మావతి కాలనీ,  మైల్ స్టోన్ కాలనీ, గాయత్రికాలనీ ఫేజ్ -3 కాలనీ, హయత్ నగర్ డివిజన్ లోని బంజారా కాలనీ, రంగనాయకులగుట్ట, ఇన్ఫర్మేషన్ కాలనీ, కోర్టు, ఆర్టీసీ డిపో, సబ్ స్టేషన్ ప్రాంతాలు, వనస్థలిపురం డివిజన్ పరిధిలోని పనామా గోడాన్, సుష్మా టాకీస్, ఆటోనగర్ ప్రాంతాలు, మన్సూరాబాద్ డివిజన్ లోని పలు ప్రాంతాల్లోకి భారీగా వరద చేరింది. ఇండ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

పూర్తికాని వరదనీటి కాల్వలు 

 హయత్ నగర్ డివిజన్ లోని బంజారా కాలనీ ముంపు ప్రాంతంగా గుర్తింపు ఉంది. మునుగనూర్ కల్వర్ట్ నుంచి పెద్ద అంబర్ పేట్ అవుట్ లెట్ వరకు దశలవారీగా దాదాపు రెండు కిలోమీటర్ల మేర వరద నీటి కాలువ నిర్మాణం చేపట్టినప్పటికీ పనులు పూర్తి కాలేదు. వరద నీటి కాలువ నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంతో వర్షాలు పడినప్పుడల్లా బంజారా కాలనీవాసులు వరద నీటితో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  వర్షాలు పడినప్పుడల్లా బీఎన్ రెడ్డి డివిజన్ నుంచి వరద హయత్ నగర్ డివిజన్ మీదుగా వెళ్తాయి. గతంలో హయత్ నగర్ డివిజన్ లోని బాతుల చెరువులోకి వెళ్లే విధంగా నాలా కనెక్షన్ ఉండేది, బీఎన్ రెడ్డి డివిజన్ లో  వరద కాల్వ నిర్మాణం చేపట్టడంతో బాతుల చెరువుకు నీరు చేరడం లేదు. ఫలితంగా  వర్షాలు పడినప్పుడల్లా వరద రోడ్లపై ప్రవహిస్తూ హయత్ నగర్ డివిజన్ లోని పలు కాలనీలు నీట మునుగుతున్నాయి. 

 ప్రతి వానాకాలం మా కాలనీ మునుగుతుంది 

హయత్ నగర్ డివిజన్ లోని బంజారా కాలనీ ప్రతి వానాకాలం నీట మునిగుతుంది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద మా కాలనీ పక్కనే ఉన్న నాలా ద్వారా పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీ లోని వరద కాల్వలకు చేరుతుంది. అయితే, మునుగనూర్ కల్వర్టు వద్ద చేపట్టిన నాలా పనులు పూర్తి కాకపోవడంతో వరద బంజారా కాలనీకి చేరుతుంది. దీంతో ప్రతి వానాకాలంలో మా కాలనీ పది, పదిహేను రోజుల పాటు నీళ్లు ఉంటాయి.

- గాసీరాం నాయక్, బంజారా కాలనీ