ఆపరేషన్ స్థాయిలో ఆర్‌ఎంపీల చికిత్సలు
తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ టీ.కిరణ్ కుమార్
బిజినేపల్లి మే 12 గ్రామీణ స్థాయిలో పని చేసే ఆర్‌ఎంపీ వైద్యులు ఆపరేషన్ స్థాయిలో చికిత్సలు చేస్తున్నారని, అలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నామని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ టీ.కిరణ్ కుమార్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని పలు ఆర్‌ఎంపీ కేంద్రాలను తనిఖీ చేశారు. మండల కేంద్రంలోని భూపాల్ నాయక్, శివరాం, మహబూబ్ ఆలీ, కృష్ణయ్యలకు చెందిన చికిత్స కేంద్రాల్లో తనిఖీలు చేశారు. వీరితో పాటు మరి కొంత మంది ఆర్‌ఎంపిలు తమ కేంద్రాలను మూసి పారిపోయారన్నారు.
వీరు రోగులకు ప్రథమ చికిత్స చేయాల్సి ఉండగా, అంతకు మించి శాస్త్ర చికిత్సల స్థాయిలో వైద్యం చేస్తున్నారని, వారి వద్దకు వచ్చే రోగులకు అధిక మోతాదులో స్టెరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్, ఆంటీ బయోటిక్స్ ఇస్తున్నారని గుర్తించినట్లు తెలిపారు. అంతే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోని రోగులకు ప్రయివేటు ఆసుపత్రిలో వైద్య పరీక్షలు, ఇతర చికిత్సలు, ఆపరేషన్లు చేపించి అధిక మొత్తంలో కమిషన్ల తీసుకుంటున్నారని అన్నారు.
గ్రామీణ స్థాయిలోని అర్‌ఎంపీలు అందరు ఒక అసోసియేషన్ ముఠాగా ఏర్పడి ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల రోగులకు అపనమ్మకం ఏర్పరచి తప్పుదోవ పట్టిస్తున్నరని అన్నారు. అధిక డోస్ లు ఇవ్వడం వలన కిడ్నీ సమస్యలు వస్తున్నాయని, అందుకు ఆర్‌ఎంపీ చికిత్సలే ప్రధాన కారణం అన్నారు. ఈ తనిఖీల్లో భాగంగా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లీగల్ కమిటీ సభ్యుడు డా. సన్నీ డెవిస్, బృందం సభ్యులు డా.మహేష్, విజిలెన్స్ అధికారి డా.రాములు తదితరులు పాల్గొన్నారు.






