21 August, 2026 | 2:20 AM

ప్లాట్ల ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలి

21-08-2026 12:00 AM

ఘట్‌కేసర్, ఆగస్టు 20 (విజయక్రాంతి): వ్యయ ప్రయాసలతో ఎంతో కష్టంగా మేము కొనుగోలు చేసిన ప్లాట్లకు సంబంధించిన భూమిని కొందరు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని ప్లాట్ల బాధితులు వేడుకుంటున్నారు.

గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్లాట్ల బాధితులు సుంకరి వెంకటేష్, రామిడి రాజిరెడ్డి, వంగేటి భాస్కర్ రెడ్డి, ఉమ్మడి యాదిరెడ్డి, రామిడి రామిరెడ్డి, చుంచు మహేందర్, పి. అర్జున్ రాజు, బి. శ్రీకాంత్ రెడ్డి, ఆర్. బ్రహ్మయ్య మాట్లాడుతూ ఘట్ కేసర్ డివిజన్ పరిధిలోని కొండాపూర్‌లో 25 ఏళ్ల క్రితం పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి సర్వే నంబర్లు 63, 67 లలో శ్రీనిధి ఇంపీరియల్ పార్క్ పేరుతో ప్లాట్లు చేసి విక్రయించారు. ఇక్కడ ప్లాట్లు కొనుక్కున్న వారంతా పేదలు, బడుగు, బలహీన వర్గాల ప్రజలు. పిల్లల చదువులు, పెళ్లిళ్ల కోసం లేదా కూతుళ్లకు కట్నం కింద ఇచ్చేందుకు అప్పట్లో అతి తక్కువ ధరలకు కొనుక్కోవడం జరిగిందన్నారు. స్థానిక రైతులైన దాసరి బాల్ రెడ్డి, సంజీవరెడ్డి గత 34 ఏళ్లుగా ఈ భూమి మాది అని చెబుతూ ఇబ్బందులు పెడుతున్నట్లు తెలిపారు.

కొండాపూర్లోనే నివసిస్తూ ఇన్నేళ్లుగా తన స్థలంలో ఇతరులు ప్లాట్లు చేస్తుంటే ఎందుకు ఊరుకున్నట్లని ప్రశ్నించారు. రాత్రి వేళల్లో దొంగతనంగా జేసీబీ లతో వచ్చి ప్లాట్ల హద్దురాళ్లను తొలగించడం, దున్నడం, చెట్లను నరకడం లాంటి పనులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ 24 ఎకరాల భూమిలో వీరి భాగం కేవలం 8 ఎకరాలు మాత్రమేనని, కానీ, రోడ్డు పక్కన మంచిగా ఉన్న ఈ 8 ఎకరాల ప్లాట్ల స్థలాన్ని ఆక్రమించేందుకు ఇప్పటికే మూడు ప్రదేశాలు మారుస్తూ ఇక్కడికి వచ్చారని, వారు 2000 సంవత్సరంలో ప్లాట్లు అమ్మినట్లు ఆధారాలు, పత్రాలు తమ వద్ద ఉన్నాయని, వాటిని కోర్టుకు సమర్పిస్తామని తెలిపారు.

గతంలో కూడా ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశామని, అప్పటి పోలీసు అధికారులు ప్లాట్ల యజమానులకే మద్దతు ఇచ్చి, వారిని మందలిం చడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఈ విషయమై హైకోర్టులో కేసు పెండింగ్లో ఉందని, కేసు తేలే వరకు రాత్రిపూట దౌర్జన్యాలు చేయడం సరికాదని, ఏమున్నా కోర్టులోనే చూసుకోవాలని స్పష్టం చేశారు. ఇకపై ఉపేక్షించేది లేదని, మళ్లీ జేసీబీలతో వచ్చి అక్రమాలకు పాల్పడితే జరిగే పరిణామాలకు తమరే  పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని తీవ్రంగా హెచ్చరించారు.