08-11-2025 01:05:44 AM
-ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేతలు
-సీఎంను దొంగ అనడంపై తీవ్ర అభ్యంతరం
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 7 (విజయక్రాంతి) : జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతున్న వేళ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్రమంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. సీఎంను దొంగ అంటూ సంబోధించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట ఎన్నికల సంఘానికి ఈసీ ఫిర్యాదు చేసింది. ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. పీసీసీ ఎన్నికలకో ఆర్డినేషన్ కమిటీ శుక్రవారం రాష్ర్ట ఎన్నికల ప్రధాన అధికారిని కలిసి ఈ మేరకు ఒక వినతిపత్రం సమర్పించింది.
గురువారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బోరబండలో నిర్వహించిన బీజేపీ ప్రచార రోడ్‌షోలో బండి సంజ య్ ప్రసంగిస్తూ, ముఖ్యమంత్రిని ఉద్దేశించి వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారని, ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పూర్తిగా ఉల్లంఘించడమేనని ఫిర్యాదులో పేర్కొంది. ఏం జరిగిందంటే.. గురువారం బోరబండ లో జరిగిన ప్రచార ర్యాలీలో బండి సంజయ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ గెలిస్తే తులం బంగారం ఇవ్వడం కాదు.. ప్రజల వద్ద ఉన్న బంగారం కూడా లాక్కుపోతారు అని విమర్శించారు.
అంతేకాకుండా, సీఎం రేవంత్ రెడ్డి.. కేసీఆర్ కుటుంబాన్ని ఒక్క అవినీతి కేసులో కూడా జైల్లో పెట్టలేదు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నాయి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపైనే కాంగ్రెస్ పార్టీ అ భ్యంతరం వ్యక్తం చేస్తూ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. ఈ ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారం మరింత వేడెక్కింది.