08-11-2025 12:54:32 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 7 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ పోలింగ్‌కు ముందే అధికార కాంగ్రెస్ పార్టీ ఓటమి అంగీకరించిందని.. ఉప ఎన్నిక తన పాలనకు రెఫరెండం కాదని సీఎం చెప్పడం ఇందుకు నిదర్శనమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా శుక్రవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని వెంగళరావు నగర్‌ల్లో నిర్వహించిన భారీ రోడ్ షోలో ఆయన ప్రసంగించారు. ముఖ్యమంత్రికి దమ్ము, ధైర్యం ఉంటే తన 24 నెలల పరిపాలనను ప్రజల ముందుంచి తీర్పు కోరాలని, అంతేకానీ పాత కథలు చెప్పి ప్రజలను మభ్యపెట్టవద్దని సూటిగా సవాల్ విసిరారు.
ఓటమి భయంతోనే..
ప్రజల్లో తన ప్రభుత్వంపై నెలకొన్న తీవ్ర వ్యతిరేకతను, వైఫల్యాలను గ్రహించే రేవంత్ రెడ్డి ముందు జాగ్రత్తగా ఈ ఎన్నికను రెఫరెండంగా భావించవద్దని అంటున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘గత రెండు సంవత్సరాల్లో చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్క మంచి పని చేయలేదు. విద్యార్థులు, యువకులు, రైతు లు, పారిశ్రామికవేత్తలు.. ఇలా సబ్బండ వర్గాలను మోసం చేశారు. అందుకే తన పాలన ను చూపించి ఓట్లు అడిగే ధైర్యం ఆయనకు లేదు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతోనే జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ఓటమి ఖాయమైపోయింది‘ అని కేటీఆర్ అన్నారు.
హైడ్రా పేదలపైనేనా...
హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తూ అరాచకం సృష్టిస్తున్న రేవంత్ రెడ్డికి, తన క్యాబినెట్ మంత్రులు అడ్డగోలుగా కట్టుకున్న అక్రమ ఫాంహౌస్‌లు, నిర్మాణాలు కనిపించడం లేదా అని కేటీఆర్ నిలదీశారు. రోడ్‌షోలో భాగంగా, పలువురు మంత్రుల అక్రమ నిర్మాణాల చిత్రాలను ఎల్‌ఈడీ స్క్రీ న్లపై ప్రదర్శిస్తూ, హైడ్రా గురించి గొప్పగా చెప్పుకునే రేవంత్ రెడ్డికి సిగ్గు, దమ్ము ఉంటే ఈ అక్రమ నిర్మాణాలను ముందు కూల్చా లి. మీ బుల్డోజర్ కేవలం పేదల బస్తీలపై ప్రతాపం చూపడానికేనా.. అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
వికాసానికి, అరాచకానికి మధ్య పోటీ..
ఈ ఎన్నిక కేవలం అభ్యర్థుల మధ్య కాదు, గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలోని వికాసానికి, ఈ రెండేళ్ల కాంగ్రెస్ పాలనలోని అరా చకానికి మధ్య జరుగుతున్న పోటీ అని కేటీఆర్ అభివర్ణించారు. ‘మేము పదేళ్లలో ఐటీ పరిశ్రమను పరుగులు పెట్టించాం. టిమ్స్ ఆసుపత్రులు కట్టాం. లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించాం. 47 ఫ్లైఓవర్లతో నగరం రూపురేఖలు మార్చాం. మీరు ఈ రెండేళ్లలో హైదరాబాద్‌ను అధఃపాతాళానికి తొక్కారు. రియల్ ఎస్టేట్‌ను దెబ్బతీసి, ఆటో డ్రైవర్ల పొట్టకొట్టారు. దీన్ని చూశా మీకు ఓటేయాలి..’అని ప్రశ్నించారు.
ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్‌కు గట్టిగా బుద్ధి చెబితేనే, ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగి రాష్ట్రవ్యాప్తంగా పెండిం గ్‌లో ఉన్న ఆరు గ్యారెంటీలు అమలవుతాయని కేటీఆర్ అన్నారు. పొరపాటున కాంగ్రె స్‌కు ఓటేస్తే, ప్రజలు మా పాలనను ఆమోదించారని భావించి హామీలను పూర్తిగా గాలికొదిలేస్తారు. కాబట్టి జూబ్లీహిల్స్ ప్రజ లు ఇచ్చే తీర్పు తెలంగాణ ప్రజలందరి భవిష్యత్తును నిర్దేశిస్తుందని వివరించారు.