calender_icon.png 8 November, 2025 | 4:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వికాసమా.. విధ్వంసమా?

08-11-2025 12:57:47 AM

  1. ఏది కావాలో జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచించాలి
  2. రేవంత్ బ్లాక్‌మెయిలర్.. గన్‌కల్చర్ పాలన
  3. ‘ఇన్వెస్ట్‌మెంట్ హబ్’గా ఉన్న హైదరాబాద్.. నేడు ‘ఇన్‌సెక్యూరిటీ హబ్’ 
  4. ‘మీట్ ద ప్రెస్’లో మాజీ మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, నవంబర్ 7 (విజయక్రాంతి) : కేసీఆర్ పాలనలో రాష్ట్రం వికాసం వైపు వెళ్తే, రేవంత్ పాలనలో విధ్వంసం జరుగుతుందని, వికాసమా? విధ్వంసమా? ఏది కావా లో ప్రజలు ఆలోచించాలని మాజీ మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఒక బ్లాక్ మెయిలర్ అని, సమాచార హక్కు చట్టం ఉపయోగించి రియల్ ఎస్టేట్, వ్యాపార వేత్తలను బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపించారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో హరీశ్‌రావు మాట్లాడారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నాలుగు లక్షల మంది ప్రజల భవిష్యత్తు కాదని, నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల భవిష్యత్తు అని స్పష్టం చేశారు. ఈ అరాచక ప్రభుత్వానికి జూబ్లీహిల్స్ ప్రజలు బుద్ధి చెప్పాలని, ఈ తీర్పు రాష్ర్ట ప్రజలకు మేలు చేకూర్చాలని ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి బ్రదర్స్ తప్ప రాష్ట్రంలో ఏ వర్గమూ సంతోషంగా లేదని, రెండేళ్ల రేవంత్ పాలన అరాచకాలకు జూబ్లీహిల్స్ ప్రజలు చరమగీతం పాడనున్నారని జోస్యం చెప్పారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వమంటే కాలేజీల మీద విజిలెన్స్, పోలీసులతో దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు.  చెరువులను కబ్జా చేసి, చేపట్టిన అక్రమ నిర్మాణాలను గుర్తించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెబుతుంటే, సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం సెటిల్‌మెంట్ చేసుకుంటున్నారని మండిపడ్డారు. చివరకు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రజలను కూడా పథకాలు ఆగిపోతాయని సీఎం రేవంత్‌రెడ్డి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఓటమి భయంతో ఫ్రస్టేషన్ పెరిగిపోతుందని ఎద్దేవా చేశారు. కంటోన్‌మెంట్ ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చారని, అక్కడ ఏం అభివృద్ధి చేశారో చూపించాలని సవాల్ విసిరారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే వీళ్లకు ఎన్టీఆర్, పీజేఆర్ గుర్తు వస్తారని ఎద్దేవా చేశారు. మూసీ, హైడ్రా పేరిట ఇళ్లు కూల్చితే బాధితులకు బీఆర్‌ఎస్ అండగా నిలబడిందని, అందుకే జూబ్లీహిల్స్‌లో ప్రశ్నించే గొంతుకను గెలిపించాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు.

అన్ని రంగాల్లో తిరోగమనం.. క్రైమ్‌రేట్‌లో పురోగమనం

రేవంత్‌రెడ్డి పాలనలో అన్ని రంగాల్లో తిరోగమనం, ఒక్క క్రైమ్‌రేట్‌లో మాత్రమే పురోగమనమని ఎద్దేవా చేశారు. కేసీఆర్ అగ్రికల్చర్ పెంచితే, రేవంత్‌రెడ్డి గన్ కల్చర్ పెంచారని విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రత నిర్వహణ లేకుండా పోయిందని, నడి రోడ్డుపై మర్డర్లు జరుగుతున్నాయని గుర్తుచేశారు. 2025 జనవరి నుంచి సెప్టెంబర్ వర కు రాష్ర్టంలో నమోదైన క్రైం రేటు చూస్తే రేవంత్ ఘనత ఏపాటిదో అర్థమవుతుందన్నారు.

రాష్ట్రంలో 1700 కిడ్నాప్‌లు, 123 రేప్ కేసులు, 1051 దోపిడీలు, 6,411 ఇండ్ల లో దొంగతనాలు నమోదు అయ్యాయని, మహిళల పట్ల జరుగుతున్న నేరాల శాతం 12.3 శాతం పెరిగాయని వివరించారు. గడిచిన ఏడాదితో పోల్చితే లైంగికదాడులు 28 శాతం, కిడ్నాపులు 26 శాతం, ఇప్పుడు సైబరాబాద్‌లో 41 శాతం, హైదరాబాద్‌లో 60 శాతం క్రైమ్ రేటు పెరిగిందని తెలిపారు. 

ముస్లిములకు క్షమాపణ చెప్పాలి

కాంగ్రెస్ అభ్యర్థి సోదరుడు వెంకట్ యా దవ్ పేరిట మూడు ఓట్లు ఉన్నాయని, దీనిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినా ఎలాం టి చర్యలు లేవన్నారు. ఓట్ చోరీ అనే రాహుల్ గాంధీ ఎందుకు ఇక్కడ ఓటు చోరీ గురించి మాట్లాడటం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ బీహార్‌లో బీజేపీకి ఎంఐఎం బీ టీమ్ అంటున్నారని, ఇక్కడ చూస్తే ఎంఐఎం కాంగ్రెస్ బీ టీమ్‌గా ఉందని, ఈ రకమైన విధానాలతో ఎవరిని మోసం చేస్తున్నారని ప్రశ్నించారు.

బీసీ రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్, బీజేపీలు కలిసి బీసీలను మోసం చేశాయని, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పని చేస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ ఎప్పుడూ వచ్చింది, ముస్లింలు ఎప్పటి నుంచి ఉన్నారో రేవంత్‌రెడ్డికి తెలుసా అని ప్రశ్నించారు. జమాత్ ఉల్మా హింద్ అజాద్ కోసం లొల్లి చేసిందని, అప్పుడు కాంగ్రెస్ ఎక్కడ ఉందని అడిగారు. తప్పుడు వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి ముస్లింలకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

రూ. 4000 కోట్ల బడ్జెట్, ఇమాం మౌజం గౌరవ వేతనాల పెంపు ఏమైందని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ నిలదీయడం వల్ల అజారుద్దీన్‌కు మంత్రి పదవి వచ్చిందన్నారు.  పథకాలు అమలు చేసేందుకు పైసల్లేవు అంటూనే ఫ్యూచర్ సిటీ, మూసీ సుందరీకరణకు లక్షల కోట్లు కేటాయిస్తున్నారని మండిపడ్డారు. 

జూబ్లీహిల్స్ ప్రజలు ఓటర్లు మాత్రమే కాదు.. న్యాయ నిర్ణేతలని, ఆత్మ సాక్షిగా ఓటు వేసి కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ప్రస్తుతం  రాష్ట్రలో రెండే టీములున్నాయని, ఒకటి ఆరు గ్యారెంటీలు ఎగ్గొడుతున్న టీమ్.. మరొకటి అమలు చేయాలని పోరాడుతున్న టీం అని మాజీ మంత్రి స్పష్టం చేశారు.

కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో కమిషన్లపై రివ్యూ

రేవంత్ రాక్షస పాలన చూసి పెట్టుబడులు తరలిపోతున్నాయని, రియల్ ఎస్టేట్ ఢమాల్ అయిందన్నారు. కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, ఫ్లుఓవర్లు, అండర్ పాస్‌లు కడితే రేవంత్ పేదల ఇండ్లు కూల్చారని విమర్శించారు. కేసీఆర్ కాలంలో ‘ఇన్వెస్ట్‌మెంట్ హబ్’గా ఉన్న హైదరాబాద్, ఇప్పు డు ‘ఇన్‌సెక్యూరిటీ హబ్’ అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదంతా ప్రభుత్వ వైఫ ల్యం కాదా అని ప్రశ్నించారు.

మహారాష్ర్టలోని ముంబై పోలీసులు.. హైదరాబాద్‌లో ని చర్లపల్లిలో వేల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుకున్నారంటే అంతకంటే అవమానం ఉంటుందా అని నిలదీశారు. సీఎం రేవంత్‌రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో కూర్చొ ని క్రైం మీద రివ్యూ చేయకుండా కమిషన్ల మీద రివ్యూ చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి... మున్సిపల్ మంత్రిగా ఫెయి ల్, విద్యా మంత్రిగా ఫెయిల్, హోం మంత్రి గా ఫెయిల్, మొత్తంగా సీఎంగా అట్టర్ ఫెయిల్ అని స్పష్టం చేశారు.

రూ.5000 కోట్లతో జూబ్లీహిల్స్‌లో చేసిన అభివృద్ధిని కేటీఆర్ వివరించారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా ఆరు గ్యారెంటీలు, రుణమాఫీ మీద గల్లా పట్టి అడిగామని, బీఆర్‌ఎస్ పోరాటం వల్లనే  రైతుభరోసా వచ్చిందన్నారు. హైడ్రా, హెచ్‌సీయూ భూములు, టీమ్స్ ఆసుపత్రుల విషయంలో, బస్తీ ఉద్యోగులు, ప్రజల కోసం ప్రభుత్వాన్ని బీఆర్‌ఎస్ నిలదీసిందని తెలిపారు.