08-11-2025 01:02:32 AM
సర్కారు నిర్లక్ష్యంతో భారీగా ప్రమాదాలు
రెండేండ్లుగా మరమ్మత్తులు శూన్యం
హైదరాబాద్, నవంబర్ 7 (విజయక్రాంతి) : ‘రోడ్లు దేశానికి ప్రాణం లాంటివి..’ అనేది మన రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖకు సంబంధించిన వెబ్‌సైట్‌లో డిపార్ట్‌మెంట్ ప్రొఫైల్‌లో మొదటి వాక్యం. దేశ అభివృద్ధి, ప్రజల అభివృద్ధికి మార్గం వేయాల్సిన రోడ్లు.. ప్రజల ప్రాణాలకే ఎసరు తెస్తున్నాయి. రాష్ట్రంలోని రోడ్లు మృత్యుమార్గాలుగా మారుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఏ రోడ్డును పరిశీలించినా.. గుంతలు, బొందలు, డాంబర్, మట్టి, కంకర కొట్టుకుపోయి ప్రమాదకరంగా మారాయి.
అందుకే రోజురోజుకూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ప్రజల ప్రాణాలు హరీ మంటున్నాయి. గడిచిన రెండేండ్లుగా రాష్ట్రంలోని రోడ్లను పట్టించుకున్న పాపాన పోలేదు. దీనికితోడు సరైన మరమ్మత్తులు కూడా చేయకపోవడంతో.. ప్రజల ప్రాణాలమీదికి తెస్తోంది. పనుల కోసం రోడ్డుపైకి వెళ్లినవారు వస్తారో.. రారో అనే ఆందోళన ప్రజల్లో కనపడుతోంది.
తాజా సంఘటన ‘చేవెళ్ల’..
తాజాగా జరిగిన సంఘటనలను తలుచుకుంటేనే వెన్నులో భయం పుడుతోంది. ఈ వారంలో చెవెళ్ల వద్ద బస్సు, టిప్పర్‌లు ఢీకొట్టుకున్న సంఘటనలో మొత్తం 19 మంది మరణించడం అందరినీ కలిచివేసింది. ఇందుకు ప్రధాన కారణం రోడ్డు సరిగా ఉండకపోవడమే. వేగంగా వచ్చిన టిప్పర్ ఇరుగ్గా, గుంతలతో ఉన్న రోడ్డుపై అడ్డదిడ్డంగా వచ్చి ఆర్టీసీ బస్సును ఢీకొట్టిందని ప్రత్యక్షసాక్ష్యులు, పోలీసులు అంటున్నారు. కనీసం రోడ్డు బాగుండి ఉంటే.. ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదనే అభిప్రాయాన్ని వారు వ్యక్తంచేస్తున్నారు.
సంఘటన తరువాత ప్రజలు, ప్రజాప్రతినిధుల మధ్య వాదోపవాదాలు కూడా రోడ్డు ఇరుగ్గా ఉండటం, వెడల్పు చేయకపోవడం, గుం తలు పూడ్చకుండా వదిలేయడం వల్ల వాహనాలు వాటిని తప్పించే క్రమంలో ఎదురుగా వస్తున్న వాహానలను ఢీకొడుతున్నాయని అనడం గమనార్హం.
రోడ్లు సరిగాలేకపోవడమే..
చేవెళ్ల సమీపంలో జరిగింది ఒక భారీ సంఘటన.. కనుక అందరూ చర్చించారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రోజూ ఇలాంటి రోడ్డు ప్రమాదాలు పదుల సంఖ్యలో జరుగుతున్నాయి. మరణాలు సంభవిస్తున్నాయి. వీటన్నింటికీ ప్రధాన కారణం రోడ్లు ఇరుగ్గా ఉండటం, సరిగా నిర్వహణ లేకపోవడం, లో తైన గుంతలు, రోడ్డంతా లేచిపోవడానికి తో డు.. మిగిమీరిన వేగం కారనంగా ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. రాష్ట్రం ఏర్పడిన తరువాత రోడ్డు ప్రమాదాలు, మరణా లను పరిశీలిస్తే.. ప్రతియేటా సగటున 7,000 మంది వరకు రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తుండటం గమనార్హం.
2021 నుంచి ఈ ప్రమాదాల్లో చనిపోతున్నవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రమాదాల సంఖ్యతోపాటు, మరణించినవారి సంఖ్య పెరుగు తుండగా.. క్షతగాత్రుల సంఖ్య తగ్గుతుండటానిన మనం గమనించవచ్చు. అంటే రోడ్లు సరిగా లేకపోవడం, గుంతల రోడ్లు, అతి వేగం కారణంగా ప్రమాదాలు ఎక్కువగా చో టుచేసుకుంటుండగా.. ప్రమాదాల్లో తీవ్రత కారణంగా ఎక్కువ మంది చనిపోతున్నారు. క్షతగాత్రుల సంఖ్య తగ్గుతూ వస్తోంది.
2016, 2017లో క్షతగాత్రుల సంఖ్య సుమా రు 24 వేల వరకు ఉండగా.. 2024 నాటికి ఈ సంఖ్య 15 వేలకు తగ్గిపోయింది. అయితే మరణాల విషయంలో.. 2020లో 6,668 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించగా.. 2024లో ఇదికాస్తా 7,281కి పెరగడం గమనార్హం. ప్రమాదాల సంఖ్యలోనూ భారీ తేడా కనపడుతోంది. 2014లో 20 వేలు గా ఉన్న ప్రమాదాల సంఖ్య 2024 నాటికి 25 వేలకుపైగా ప్రమాదాలు జరగడం గమనార్హం. అంటే రోడ్ల నిర్వహణ సరిగా లేకపోవడం, వాహనాల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరగడం, గుంతల రోడ్లపై వే గంగా ప్రయాణించడం వల్ల దుర్ఘటనలు జరుగుతున్నాయని స్ప ష్టంగా చెప్పవచ్చు.
రాష్ట్రంలో రహదారులు..
రాష్ట్రంలో ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ రోడ్లు ఉన్నాయి. రోడ్లు, భవనాల శాఖ పరిధిలో 24,245 కి.మీ. రోడ్లు ఉన్నాయి. ఇందులో 3,152 కి.మీ రోడ్లు రాష్ట్ర హైవేలు గా, 12,079 కి.మీ పొడవునా ప్రధా న జిల్లా రోడ్లుగా, 9,014 కి.మీ పొడవు ఇత ర జిల్లాల రోడ్లుగా, 2,690 కి.మీ పొడవైన జాతీయ రహదారులు (16 రహదారులు) ఉన్నాయి. ఇందులోనూ 868 కి.మీ. పొడవై న జాతీయ రహదారులు జా తీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ఆధ్వ ర్యంలో నిర్వహిస్తున్నారు. అలాగే పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో మొత్తం 68200 కి.మీ పొడవైన రోడ్లు ఉన్నాయి. ఇందులో 3985 కి.మీ పొడవైన సిమెంటు రోడ్లు, 25, 725 కి.మీ పొడవైన బీటీ రోడ్లు, 7,798 కి. మీ పొడవున డబ్ల్యూబీఎం మెటల్ రోడ్లు, 12,392 కి.మీ పొడవైన గ్రావెల్ రోడ్లు, 18, 300 కి.మీ పొడవైన మట్టి రోడ్లు ఉన్నాయి.
రెండు శాఖలదీ బాధ్యతే..
రాష్ట్రంలో మొత్తం రోడ్లు సుమారు 93 వేల కి.మీ వరకు ఉన్నాయి. ఈ రోడ్లన్నీ అటు రోడ్లు భవనాల శాఖ, ఇటు పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. అయితే వారి పరిధిలో ఉన్నమాటే గానీ.. నిర్వహణ సరిగా లేకపోవడంతో గుంతలు పడి, రోడ్డంతా లేచిపోయి, కంకర తేలి, కోతకు గురైన రోడ్ల కారణంగా ప్రతిరోజూ వందలాది ప్రమాదాలు జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే.. మధ్యలో డివైడర్ లేని డబుల్, సింగిల్ లేన్ రోడ్లపైనే అత్యధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయి.
కొన్నిసార్లు డివైడర్ ఉన్న జాతీయ, రాష్ట్ర రహదారులపై ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ.. అవి కేవలం సిగ్నళ్లు పాటించకపోవడం, అతి వేగం, యూ టర్న్ తీసుకునే ప్రదేశాలలో నిర్లక్ష్యంగా నడపడం వల్లనే అనేది అందరికీ తెలిసిందే. అయితే రాష్ట్రంలో రహదారులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించా ల్సిన ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ శాఖ లు పూర్తి నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నాయి.
దీనికితోడు గుంతలు పూడ్చకపోవడం, ఇరు గ్గా ఉన్న రోడ్లను విస్తరించకపోవడం, రోడ్డుపక్కన అడ్డుగా ఉన్న పొదలు, చెట్లను తీయక పోవడం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయి, రోడ్లకు ఇరు పక్కలా ఎప్పటికప్పు డు గ్రావెల్‌ను పోయకపోవడం వల్ల రోడ్లు కోతకు గురై ప్రమాదాలు జరుగుతున్నాయి. గుంతలను తప్పించే క్రమంలో ఎదురెదురుగా వచ్చే వాహనాలు ఢీకొట్టుకుంటున్నాయి. పైగా రాత్రిపూట అయితే ఈ ప్రమాదాలు మరింత తీవ్రంగా ఉంటున్నాయి.
వాస్తవానికి ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ శాఖలు.. రెండూ.. ఈ ప్రమాదాలకు బాధ్యులే. వారి పరిధిలో ఉన్న రోడ్ల నిర్వహణ సరిగా చేయకపోవడం వల్లనే ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఏ మన్నా అంటే.. నిధుల కొరత అంటూ దీర్ఘా లు తీస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం అడే రోడ్లను పట్టించుకోకపోవడం ప్రభుత్వం నిస్తేజానికి నిదర్శనం. పైగా గడిచిన రెండేండ్లుగా రాష్ట్రంలోని రోడ్లును పట్టించుకున్న పాపానపోలేదు.
దీనితోనే చేవెళ్ళ లాంటి సంఘటనలను జరుగుతున్నాయని ఇంజనీరింగ్ నిపుణులు కూడా చెబుతున్నారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ శాఖలు కండ్లు తెరిచి.. రోడ్ల నిర్వహణ సరిగా చేపట్టి.. ప్రయాణికుల ప్రణాలు కాపాడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే.. ఈ గుంతల రోడ్లు.. ప్రభుత్వ పెద్దలకు ఇబ్బంది కలిగించడం లేవు.. ప్రజల ప్రాణాలకే ఇబ్బందులు కలిగిస్తున్నాయి. వారి ప్రాణాలే పోతున్నాయి..!
