23-09-2025 05:17:43 PM
కోరుట్ల రూరల్,(విజయక్రాంతి): మహిళల సంపూర్ణ ఆరోగ్యంతోనే ప్రతిష్టమైన వ్యవస్థను నిర్మించవచ్చునని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు. మంగళవారం జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని అయిలాపూర్ గ్రామంలో స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి మహిళా ఆరోగ్యంతో ఉండాలన్న ఉద్దేశ్యంతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. మహిళలు ప్రధానంగా ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలకు వైద్యం అందించడంకోసం ఆరోగ్య మహిళ కార్యక్రమం ప్రవేశపెట్టబడిందన్నారు. కోరుట్ల నియోజకవర్గ ప్రజలు నాడు డయాలసిస్ కొరకు హైదరాబాద్ కు వెళ్ళేవారాని, నేడు కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలోనే డయాలసిస్ చేయించుకుంటున్నారని అన్నారు.
కెసిఆర్ హయాంలోనే కోరుట్ల ప్రభుత్వాసుపత్రినీ 100 పడకల ఆస్పత్రిగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా డయాలసిస్ సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రైతు భరోసా, మిషన్ భగీరథ వంటి పథకాలను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత దేశంలో అమలులోకి వచ్చాయని, తల్లి, బిడ్డ క్షేమం కొరకు కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ అందజేశారని అన్నారు. నేడు ఇది అమలులో లేక పోవడంతో గర్భవతులకు సరైన పోషకాలు కలిగిన ఆహారం అందడం లేదన్నారు. ఇకనైనా ఈ ప్రభుత్వం గర్భవతులకు న్యూట్రిషన్ కిట్ అందజేయాలన్నారు. అనంతరం ఆసుపత్రి ఏర్పాటుచేసిన బోర్ పంపును గ్రామంలో ఏర్పాటు చేసిన ఐమాస్ లైట్ ను ఆయన ప్రారంభించారు.