18-11-2025 12:00:00 AM
సామాజిక కార్యకర్త బక్క జడ్సన్
మేడ్చల్, నవంబర్ 17 (విజయ క్రాంతి): మేడ్చల్ జిల్లా షామీర్పేట మండలం బొమ్మరాసిపేట శివారులో నకిలీ పత్రాలతో అక్రమంగా భూమి పట్టా చేసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త బక్క జడ్సన్ సోమవారం కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. 323 నుంచి 409 సర్వేనెంబర్ వరకు1049 ఎకరాల భూమి 1965లో మీరు రహమత్ అలీ, మరో ఆరుగురు నుంచి దుగ్గిరాల బలరామకృష్ణ కొనుగోలు చేశారని, ఆ భూమి ఆయన వారసులైన దుగ్గిరాల అమరేందర్ బాబు తో పాటు మరో 20 మంది పేరిట రిజిస్ట్రేషన్ చేశారని తెలిపారు.
వారందరూ పార్టిషన్ డీడ్, మ్యూటేషన్ చేయించుకున్నారని తెలిపారు. పహానీలో కూడా పేర్లు నమోదు చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. వీరిలో చాలామంది విదేశాలకు వెళ్లారని, ఇదే అదునుగా భావించిన అక్రమార్కులు నకిలీ సాదా బైనామాలు సృష్టించి 1981లో రెగ్యులరైజ్ చేయించుకున్నారని తెలిపారు.
వాస్తవానికి ఆ సమయంలో సాదా బైనామాలను రెగ్యులరైసు చేసే అధికారం తహసీల్దారులకు లేదని తెలిపారు. అధికారులు కబ్జాదారులు కుమ్మక్కయ్యారని ఆయన ఆరోపించారు. కబ్జాదారులు రైతుల ముసుగులో నానాయాగి చేస్తున్నారని తెలిపారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.