18-11-2025 12:00:00 AM
అచ్చంపేట ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ
అచ్చంపేట, నవంబర్ 17: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఉమామహేశ్వర ఆలయ అభివృద్ధికి నిరంతర కృషి చేస్తున్నానని అచ్చంపేట ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ తెలిపారు. కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా ఆలయంలోని పార్వతి, పరమేశ్వరులను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి కుంకుమార్చన, శివునికి అభిషేక పూజలు చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆలయ సమీపంలోని కొండ చరియలు విరిగిపడిన ప్రాంతాన్ని పరిశీలించారు.
అలాగే కార్యనిర్వాహణ అధికారి కార్యాలయం, యాగశాల గదులు ధ్వంసం కావడంతో వాటిని కూల్చివేసి త్వరలోనే కొత్తవి నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని. దాని గురించి సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటానన్నారు. ఆలయాన్ని ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు సంబంధిత మంత్రులు, అధికారులతో మాట్లాడి అవసరమైన చర్యలు చేపడుతామని చెప్పారు. ఉమామహేశ్వర దేవస్థానం అభివృద్ధికి మాస్టర్ ప్రణాళికను రూపొందిస్తున్నామని తెలిపారు.
దీంతో పాటు ఇకపై ఆలయానికి వచ్చే భక్తులకు ఉచితంగా స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. అలాగే అటవీశాఖ ఏర్పాటు చేసిన టోల్ గేట్ ను తొలగించేలా చూస్తానని హమీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బీరం మాధవరెడ్డి, మామిళ్ళపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం చైర్మన్ నరసింహారావు, ఈవో శ్రీనివాసరావు, పాలకమండలి సభ్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.