21-11-2025 12:54:40 AM
హైదరాబాద్, నవంబర్ 20 (విజయక్రాంతి) : బీఆర్‌ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై దాఖలైన కేసులో కీలక పరిణామం చోటుచేసుకున్నది. తమ పార్టీ నుంచి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై వేటు వేయాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు దాఖలుచేసిన కేసుకు సంబంధించి స్పీకర్ విచారణ కొనసాగుతూనే ఉన్నది. అయితే ఈ కేసులో సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువులోగా స్పీకర్ విచారణ పూర్తికాకపోవడంతో అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తంచేసింది.
నాలుగు వారాల్లో విచారణ పూర్తి చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో ఇప్పటికే 8 మంది వివరణ ఇస్తూ తమ అఫిడవిట్లను స్పీకర్‌కు సమర్పించారు. వివరణ ఇచ్చిన వారి విచారణ పూర్తి అయింది. మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం ఇంకా అఫిడవిట్లు సమర్పించలేదు. దీనిపై స్పందించిన స్పీకర్.. అనర్హత పిటిషన్‌పై వెంటనే అఫిడవిట్లు దాఖలు చేయాలని ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు మరోసారి నోటీసులు జారీ చేశారు.
మిగిలింది ఇద్దరే..
పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విచారణ గురువారంతో ముగిసింది. కేసు విచారణ ఆలస్యంపై సుప్రీం సీరియస్ అవడంతో పాటు నాలుగు వారాలు గడువు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విచారణలో వేగం పెంచాలని అసెంబ్లీ స్పీకర్ నిర్ణయించారు. ఇందులో భాగంగా రెండో విడత విచారణలో నలుగురు ఎమ్మెల్యేలను నేడు విచారణకు పిలిచారు. ఉదయం పోచారం శ్రీనివాస్‌రెడ్డి వర్సెస్ జగదీశ్ రెడ్డి కేసును స్పీకర్ విచారించారు.
ఇరు వర్గాల ఓరల్ ఆర్గ్యుమెంట్స్‌ను స్పీకర్ విన్నారు. అలాగే అరికెపూడి గాంధీ వర్సెస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కేసు విచారించారు. వీరి విచారణ తో మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తి అవుతుంది. అయితే పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కుంటున్న 10 మంది ఎమ్మెల్యే లకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు జారీచేయగా అందులో ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం ఇప్పటి వరకు అఫిడవిట్‌లు దాఖలుచేయని విషయం తెలిసిందే.
విచారణకు హాజరైతే అనర్హత వేటు తప్పదనే ఉద్దేశంతోనే స్పీకర్‌కు వివరణ ఇవ్వడంలో జాప్యంచేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో వారి ఇద్దరికి స్పీకర్ మరోసారి నోటీసులు జారీచేయడంతోపాటు అనర్హత పిటిషన్లపై వెం టనే అఫిడవిట్ దాఖలు చేయాలని స్పష్టంచేశారు.
వేటు తప్పని పరిస్థితి..
బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి జంప్ అయిన పది మంది ఎమ్మెల్యేల్లో 8 మంది పార్టీ ఫిరాయించినట్టు నిరూపించే కీలకమైన ఆధారాలు లేకపోయినప్పటికీ ఇద్దరు ఎమ్మెల్యేలకు మాత్రం ప్రమాదం పొంచి ఉన్నది. దానం నాగేందర్, కడియం శ్రీహరి మినహా మిగిలిన వారందరూ సేఫ్ జోన్‌లోనే ఉన్నట్టు స్పష్టమ వుతున్నది. అయితే దానం, కడియం లపై మాత్రం వేటుపడే అవకాశాలు అధికంగానే కనిపిస్తున్నాయి.
ఈ విషయాన్ని గ్రహించిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు, కాంగ్రె స్ పార్టీ అనర్హత వేటు పడే లోపే రాజీనా మా చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే దానం నాగేందర్ ఢిల్లీ వెళ్లినట్టు సమాచారం. ఏఐసీసీ పెద్దలను కలసి భవిష్యత్ కార్యాచ రణపై చర్చలు జరపనున్నట్టు తెలుస్తోంది. నేటితో ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ ముగియ నున్నప్పటికీ ఇప్పటి వరకు దానం అఫిడవిట్లు దాఖలు చేయలేదు.
విచారణకు హాజరైతే వేటు పడుతుందని దానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. వేటు పడితే ఆరు సంవత్సరాల పాటు పోటీ చేయడానికి అవకాశం ఉండదు. దీంతో రాజీనామా చేసేందుకు దానం మొగ్గు చూపుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
ఈ నేపథ్యంలో అటు దానం నాగేందర్, కడియ శ్రీహరి.. రాజీనామా చేస్తే ఎదురయ్యే పరిస్థితులపై పార్టీ అధిష్ఠానంతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరిపై అనర్హత వేటు తప్పని పరిస్థితుల్లో వారితో రాజీనామా చేయించేందుకే కాంగ్రెస్ పార్టీ మొగ్గు చూపుతున్నది. దీంతో త్వరలోనే రాష్ట్రం లో మరో రెండు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నది.