13-05-2025 06:46:19 PM
యువ చిత్రనిర్మాత సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. చాలా కాలం తర్వాత హైదరాబాద్‌లో తిరిగి సినీమా షూటింగ్ ప్రారంభమైంది. పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తుండగా, ప్రముఖ నటి శ్రీయా రెడ్డి కూడా ‘ఓజీ’ షూటింగ్‌లో చేరారు. మంగళవారం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటున్న ప్రస్తుత షెడ్యూల్‌లో ఆమె పాల్గొన్నారు. సెట్స్‌కి తిరిగి రావడం పట్ల తన ఆనందాన్ని, ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తూ, దర్శకుడు సుజీత్, చిత్ర బృందంతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని శ్రీయా రెడ్డి అన్నారు. తాను ఓజీ సెట్స్‌కి తిరిగి వచ్చానని, తను పవన్ కల్యాణ్ తో కలిసి పనిచేయడానికి చాలా ఉత్సాహంగా ఉందని, ఇదొక అద్భుతమైన అనుభవమన్నారు. ఇంత లోతుగా ఉన్న పాత్రను పోషించినందుకు నిజంగా కృతజ్ఞుతలు తెలుపుకుంటున్నానని శ్రీయా రెడ్డి పేర్కొన్నారు.
ఇటీవలే ‘సలార్’ చిత్రంలో రాధా రమ పాత్రకు విమర్శకుల ప్రశంసలు అందుకున్న శ్రీయా రెడ్డి ఇక ‘ఓజీ’లో ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. హైదరాబాద్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, ఆమె ఇలా అన్నారు. హైదరాబాద్ నాకు ఎప్పుడూ రెండో ఇల్లులాంటిదని, నా స్నేహితులు చాలా మంది ఇక్కడివారే. నేను పెద్దగా భోజన ప్రియురాలిని కాకపోయినా, ఇక్కడి రుచులలో కొన్నింటిని నేను నిజంగా ఇష్టపడుతున్నాను అని, కొత్తగా ప్రారంభించిన రెస్టారెంట్లను సందర్శించడానికి తను ఎదురుచూస్తున్నాను అని ఆమె వెల్లడించారు.
‘ఓజీ’ చిత్రం దాని స్టైలిష్ యాక్షన్ సన్నివేశాలు, భావోద్వేగాలతో కూడిన కథాంశం కారణంగా ప్రేక్షకులలో, అభిమానులలో తీవ్ర ఆసక్తిని రేకెత్తించిందన్నారు. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించడం, స్టార్-స్టడెడ్ తారాగణం, సుజీత్ విభిన్న దర్శకత్వ శైలితో ఈ చిత్రంపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయని వివరించారు. ప్రత్యేకమైన విజువల్స్, గ్రిప్పింగ్ కథనాలకు పేరుగాంచిన సుజీత్ దర్శకత్వం వహించిన ‘ఓజీ’ ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటిగా నిలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తోంది. రాబోయే రోజుల్లో ‘ఓజీ’ ప్రపంచం నుండి మరిన్ని ఉత్తేజకరమైన అప్‌డేట్‌ల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.