28-05-2025 04:44:14 PM
భవిష్యత్తు మార్గ నిర్దేశకులు సీనియర్ సిటిజన్స్..
పునర్నిర్మానంలో సీనియర్ సిటిజన్స్ ఫోరం అనుభవాలను తీసుకుంటాం..
సీనియర్ సిటిజన్స్ ఫోరం సమావేశ మందిరానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి..
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): భవిష్యత్తు తరానికి సీనియర్ సిటిజన్స్ మార్గ నిర్దేశకులని, మీ అనుభవం వెలకట్టలేనిదని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(MLA Yennam Srinivas Reddy) అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డలో రూ.10 లక్షల జనరల్ ఫండ్ నిధులతో నిర్మించనున్న సీనియర్ సిటిజన్స్ ఫోరం(Senior Citizens Forum) సమావేశ మందిరం భవనానికి భూమి పూజ చేశారు. మహబూబ్ నగర్ అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలి అని సీనియర్ సిటిజన్స్ ఫోరం సభ్యులకు పిలుపునిచ్చారు.
మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ధిష్టమైన ప్రణాళికలతో విజన్ 2047 ను అమలు చేస్తున్నారని, వారి అడుగుజాడల్లో నడుస్తూ మన మహబూబ్ నగర్ ను కూడా తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టం చేశారు. 2047 వరకు మన మహబూబ్ నగర్ ఎలా ఉండాలి ఏఏ అభివృద్ధి పనులు చేయాలి అని ఓ నిర్ధిష్టమైన ప్రణాళికలతోటి ముందుకు సాగుతున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆశ్శీస్సులతో మన మహబూబ్ నగర్ ను మున్సిపల్ కార్పొరేషన్ గా అభివృద్ధి చేసుకున్నామని, ఐఐఐటి కళాశాల మహబూబ్ నగర్ కు తెచ్చుకున్నామని, పాలమూరు యూనివర్సిటీలో లా, ఇంజనీరింగ్ కళాశాలలను కూడా తెచ్చుకుని మహబూబ్ నగర్ గౌరవాన్ని పెంచుకున్నామని తెలిపారు.
శాశ్వతమైన అభివృద్ధి అంటే అన్ని రకాల విశ్వవిద్యాలయాలు, రోడ్లు, వైద్యం, డ్రైనేజీలతో పాటు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించినప్పుడే సాధ్యమన్నారు. దీర్ఘకాలిక లక్ష్యం తోటి మన మహబూబ్ నగర్ ను కార్పోరేషన్ గా మార్చుకొని మన గౌరవం పెంచుకున్నామని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అర్బన్ డెవలప్మెంట్ ద్వారా ఇచ్చే నిధులను ఎక్కువ తెచ్చుకొని మన మహబూబ్ నగర్ ను అన్ని విధాలా అభివృద్ధి చేసుకోవచన్నారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా తాగునీటి కోసం రూ.220.94 కోట్ల మన మహబూబ్ నగర్ కార్పొరేషన్ కు మంజూరు అయ్యాయన్నారు. మహబూబ్ నగర్, భూత్పూర్, జడ్చర్ల ఒక క్లస్టర్ గా రూ 736 కోట్ల రూపాయల తో ప్రాజెక్టు తయారు చేశామని, భవిష్యత్తులో అద్భుత నగరంగా ట్రై సిటీ తయారు చేస్తామన్నారు.
మహబూబ్ నగర్ ను ఎడ్యుకేషనల్ హబ్ గాను, ట్రాన్స్ పోర్ట్ హబ్ గాను మర మెడికల్ హబ్ గా తీర్చిదిద్దడం, ఉత్తమమైన జీవన విధానంతో పాటు మన పిల్లలకు ఉపాధి అవకాశాలు మెరుగు పరచడానికి ఫౌండేషన్ వేస్తున్నామని, ఉత్తి మాటలు చెప్పడం కాదు అభివృద్ధి చేసి చూపిస్తాం అని ఆయన స్పష్టం చేశారు. ఏదైతే మహబూబ్ నగర్ ఫస్ట్ అని కలలు కంటున్నాన్నో ఆ కలలు నిజం చేయుటకు మీరంతా సహకరించాలని ఆయన సీనియర్ సిటిజన్స్ ను కోరారు. రాబోయే రోజుల్లో మంచి ఫలాలు అందుతాయని స్పష్టం చేశారు. ఆక్స్ ఫర్డ్ లాంటి నగరం ఒకటి ఉందని అక్కడ నెలకొల్పిన విద్యా సంస్థల ద్వారానే ప్రపంచానికి తెలిసింది అని, అలాగే ఎన్నో వేల సంవత్సరాలైనా నలందా ఖ్యాతి తరిగిపోలేదని చెప్పారు.
మహబూబ్ నగర్ బస్ స్టేషన్ ను ఇంటర్ స్టేట్ టెర్మినల్ గా చేసుకోవడానికి సీఎంకు వివరించడం జరిగిందని, వారు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. అలాగే మన మహబూబ్ నగర్ కు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి రోగులు వైద్యం చేయించుకుంటున్నారని, మన మహబూబ్ నగర్ లో ఉన్న మెడికల్ సదుపాయాలు కూడా మెరుగు పరచడానికి కృషి చేస్తున్నాని చెప్పారు. గతంలో మన మహబూబ్ నగర్ 140 మున్సిపాలిటీలలో ఒకటిగా ఉండేదని, ఇప్పుడు అదే మహబూబ్ నగర్ కార్పొరేషన్ గా 16 కార్పొరేషన్ లలో ఒకటిగా అభివృద్ధి చెందిందని, మహబూబ్ నగర్ అభివృద్ధికి విజన్ 2047 మాస్టర్ ప్లాన్ తయారు చేసుకుంటున్నామని స్పష్టం చేశారు.
మీ అనుభవం వెలకట్టలేనిదని, మీ ఆలోచనల తోటి, మీ అనుభవం తోటి మహబూబ్ నగర్ అభివృద్ధి చేసుకుందాం అని, ప్రజా బలంతో పాటు మానసిక బలం ఇవ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, టిపిసిసి ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, సిజె బెనహార్, అవేజ్, గంజి ఆంజనేయులు, రమేష్ యాదవ్, సుధాకర్ రెడ్డి, తిరుమల వెంకటేష్, చర్ల శ్రీనివాసులు, జగపతి రావు, నాగభూషణం, రాజు సింహుడు, బాలకిష్టయ్య, బాలయ్య, అహ్మద్, తదితరులు పాల్గొన్నారు.