16-09-2025 07:45:17 PM
జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి
కుమ్రంభీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ అన్ని ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు సకల సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్య అందించే దిశగా ప్రభుత్వ చర్యలు తీసుకుంటుందని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి అన్నారు. మంగళవారం జిల్లాలోని కెరమెరి మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల అగర్వాడ, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం (మోడీ)ను సందర్శించి తరగతి గదులు, రిజిస్టర్లు, వంటశాల, పరిసరాలను పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలలను సకల సదుపాయాలు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
కెజిబివిలో 10వ తరగతి విద్యార్థులకు ఖాన్ అకాడమీ ద్వారా అందిస్తున్న విద్య బోధన తీరును పరిశీలించారు. రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలని, విద్యార్థుల స్థాయికి అనుగుణంగా విద్యా బోధన చేయాలని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా మధ్యాహ్నం భోజనంలో మెనూ ప్రకారం పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించడం జరుగుతుందని, విద్యార్థులకు శుద్ధమైన త్రాగునీటిని అందించాలని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల పర్యవేక్షిస్తూ ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించాలని తెలిపారు. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేలా ఉపాధ్యాయులు పర్యవేక్షించాలని, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో పాఠ్యాంశాలు బోధించాలని, తరగతిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.
మధ్యాహ్న భోజనం తయారీలో నాణ్యమైన నిత్యవసర సరుకులు, తాజా కూరగాయలను వినియోగించాలని, వంట సిబ్బంది పరిశుభ్రత నిబంధనలు పాటించాలని తెలిపారు. వర్షాకాలం అయినందున సీజనల్ వ్యాధుల నియంత్రణలో భాగంగా వ్యక్తిగత పరిశుభ్రత పై విద్యార్థులకు అవగాహన కల్పించాలని తెలిపారు. పాఠశాల పరిసరాలలో పారిశుద్ధ నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని సిబ్బందికి సూచించారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి ఉప్పులేటి శ్రీనివాస్, మండల విద్యాధికారి ఆడే ప్రకాష్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు భరత్, ఎ. ఈ., సంబంధిత అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.