23-05-2025 12:21:27 AM
సూర్యాపేట, మే 22 (విజయక్రాంతి) : జిల్లాలో జరుగుతున్న ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలను గురువారం జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పట్టణంలోని ప్రతిభ జూనియర్ కాలేజ్ లో జరుగుతున్న ఇంటర్ మొదటి సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షను తనిఖీ చేసి పరీక్షలు జరుగుతున్న విధాన మును అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ పరీక్షలలో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ జరగకుండా పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. తదుపరి ఈనెల 25 న జరిగే పాలిటెక్నిక్ కాలేజీలో జరగనున్న జిపిఓ పరీక్ష ఏర్పాట్లను పరిశీలించారు.
అనంతరం చివ్వేంల మండలం వల్లభాపురం గ్రామంలోని జగన్మాత రైస్ ఇండస్ట్రీస్ ని పరిశీలించి అకాల వర్షాలు కురుస్తున్నందున ఎక్కువ మంది హమాలీలను ఏర్పాటు చేసుకొని ధాన్యం దిగుమతి చేసుకోవాలని సూచించారు. ఈయన వెంట కలెక్టరేట్ ఏ ఓ సుదర్శన్ రెడ్డి,మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ సంబంధిత అధికారులు తదితరులు ఉన్నారు.