23-05-2025 08:20:02 PM
సారంగాపూర్,(విజయక్రాంతి): సారంగాపూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు. మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం కురిసిన వర్షానికి వరి కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రానున్న కాలంలో ఇలాగే అకాల వర్షాలు ఎక్కువయ్యే అవకాసం ఉండడంతో, ధాన్యం మరింత తడిసిపోయి నాణ్యతను కోల్పోయే అవకాశం ఉందని, తద్వారా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
కొనుగోలు కేంద్రాల వద్ద తగిన ఏర్పాట్లు చేయాలని లారీల కొరత, హమాలీల కొరత లేకుండ చూసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. రైతులకు వాతావరణం పట్ల ఎలాంటి నష్టం వాటిల్లకన్న ముందే ప్రభుత్వం సరైన సమయంలో ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని కోరుతున్నారు. ఇలాంటి కష్టకాలంలో రైతులకు ప్రభుత్వాలు అండగా ఉండాలని , వీలైనంత చేయూత అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లలోఎలాంటి అవకతవకలు లేకుండా రైతు నష్ట పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారుల పై ఉందని సూచిస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులకు గిట్టబాటు ధర పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.