calender_icon.png 8 October, 2025 | 8:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదివాసీలు అన్ని రంగాల్లో రాణించాలి

08-10-2025 12:00:00 AM

-కొమ్రం భీంను ప్రజలు ఎన్నటికీ మరువలేం

-భీం వర్ధంతి కార్యక్రమంలో కలెక్టర్, ఎస్పీ పిలుపు

ఆదిలాబాద్, అక్టోబర్7(విజయక్రాంతి): ఆదివాసీల ఆరాధ్య దైవం కొమురం భీం చూపిన పోరాట స్ఫూర్తితో ఆదివాసీలు అన్ని రంగాల్లో రాణించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మంగళవారం ఆదిలాబాద్‌లో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన కొమురం భీం వర్ధంతి కార్యక్రమంలో ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భీం విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. 

అనంతరం ఆదిమ గిరిజన కొలం సేవ సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా ఇటీవల ఎన్నికైన కోడప సోనేరావును కలెక్టర్, ఎస్పీలు ఘనంగా సన్మానించి, అభినందించారు. ఈ మేరకు కలెక్టర్, ఎస్పీ మాట్లాడుతూ... ఆదివాసీల హక్కుల కోసం పోరాడి, ప్రాణత్యాగం చేసిన కొమురం భీంను ప్రజలు ఎన్నటికీ మరువలేరని అన్నారు. ఆదివాసీల అభివృద్ధి కోసం ప్రభుత్వాలు ఎన్నో పథకాలను ప్రవేశపెడుతున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ముఖ్యంగా ఆదివాసులు తమ పిల్లలను చదివించి ప్రయోజకులుగా చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ కాజల్ సింగ్, డి.ఎస్.పి జీవన్ రెడ్డి, ఆదివాసీ నాయకులు రామ్ రామ్ కిషన్, కొడప సోనే రావు, తానాజీ తదితరులు పాల్గొన్నారు.

మహనీయుల ఆశయాలు స్ఫూర్తిదాయకం: కలెక్టర్ 

మంచిర్యాల, అక్టోబర్ 7 (విజయక్రాంతి) : మహనీయుల ఆశయాలు మనందరికీ స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లో నిర్వహించిన మహర్షి వాల్మీకి జయంతి, కొమురం భీం వర్ధంతి వేడుకలలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ మొహమ్మద్ విలాయత్ అలీ, సంబంధిత శాఖల అధికారులతో కలిసి హాజరై వాల్మీకి, కొమురం భీం చిత్రపటాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహనీయుల ఆశయాలు అందరికీ ఆదర్శనీయమని అన్నారు.

త్యం, నీతి, ధర్మం, కర్తవ్యాలను మనకు అందించింది మహర్షి వాల్మీకి రచించిన ‘రామాయణం‘ అని, ప్రపంచానికి కర్తవ్య బోధన చేసిన మహా గ్రంధం అని అన్నారు. సత్యం, నీతి, ధర్మ మార్గాలను రామాయణం ద్వారా భవిష్యత్తు తరాలకు అందించారని, వాల్మీకి బోధనలు న్యాయం, సమానత్వ స్థాపనకు ప్రేరణగా నిలిచాయని అన్నారు. ఆదివాసుల ఆరాధ్య దైవం కొమురం భీమ్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.