కొత్త డివిజన్లను సరి చేయండి
కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి
పటాన్ చెరు, డిసెంబర్ 16 :జీహెచ్‌ఎంసీ వార్డుల పునర్విభజన (డీలిమిటేషన్)పై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్పెషల్ కౌన్సిల్ సమావేశంలో భారతి నగర్ డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి మాట్లాడారు. పటాన్చెరు నియోజకవర్గంలో డీలిమిటేషన్ గెజిట్ నోటిఫికేషన్ వల్ల ఏర్పడుతున్న ప్రజా సమస్యలను మేయర్ దృష్టికి తీసుకువెళ్లి కౌన్సిల్లో వివరించారు.
ఈ సందర్భంగా ముఖ్యంగా విద్యుత్నగర్ కాలనీని రెండు డివిజన్లుగా విభజించడం వల్ల ప్రజలకు కలిగే ఇబ్బందులు, వెలిమల గ్రామాన్ని తెల్లాపూర్ డివిజన్లో చేర్చాల్సిన అవసరం, బొల్లారం ప్రాంతాన్ని శెరిలింగంపల్లి జోన్లోనే కొనసాగించాలనే అంశాలను ప్రస్తావించారు.
అలాగే అమీన్పూర్ను నాలుగు డివిజన్లుగా పునర్విభజించాలి, తెల్లాపూర్‌ముత్తంగి ప్రాంతాలను జనాభా ప్రాతిపదికన నాలుగు డివిజన్లుగా ఏర్పాటు చేయాలి, పాత ఎంఐజీ1800 హౌసింగ్ కాలనీని నల్లగండ్ల డివిజన్లో చేర్చాలి, జేపీ కాలనీ పేరును పటాన్చెరు డివిజన్కు అనుసంధానించి పునర్నామకరణ చేయాలనే సూచనలను కూడా కౌన్సిల్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రజలకు మరింత సులభమైన పరిపాలన, వేగవంతమైన సేవలు అందేలా డీలిమిటేషన్ ప్రక్రియను ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా సవరించాలని ఈ సందర్భంగా ఆమె కోరారు.






