06-12-2024 12:36:29 AM
నల్లగొండ, డిసెంబర్ 5 (విజయక్రాంతి)/దేవరకొండ: నల్లగొండ జిల్లాలోని పీఏపల్లి మండలం దుగ్యాల మోడల్ స్కూల్‌లో మూడు రోజుల క్రితం కల్తీ ఆహారం తిని ఏడుగురు విద్యార్థులు అస్వస్థతకు గురికాగా.. గురువారం దేవరకొండ మోడల్ స్కూల్‌కు చెందిన ఐదుగురు దవాఖాన పాలయ్యారు. పాఠశాలలో మధ్యాహ్నం భోజనం చేసిన అనంతరం ఐదుగురు విద్యార్థులకు తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులయ్యాయి. దీంతో సిబ్బంది దేవరకొండ ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
ఎంఈవో మాతృనాయక్, ఎంపీడీవో డానియేల్ హుటాహుటిన దవాఖానకు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. నాసిరకం బియ్యం వండిన కారణంగానే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు దేవరకొండ సీనియర్ సివిల్ జడ్జి అనిత, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి రవీందర్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి హరీష్ బాబు మోడల్ స్కూల్ హాస్టల్‌ను పరిశీలించారు.
విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడం లేదని, గదులు శుభ్రంగా లేవని, లైట్లు, నీటి సౌకర్యం, మౌలిక వసతులు లేవని గుర్తించారు. కొంతకాలంగా పాఠశాలలో మధ్యాహ్న భోజనం సరిగ్గా వండకపోవడంతో చాలామంది విద్యార్థులు ఇంటి నుంచే లంచ్ బాక్సులు తెచ్చుకుంటున్నట్లు తెలిసింది. ఇలాంటి ఘటనలు అధికారుల పర్యవేక్షణ లోపానికి అద్దం పడుతున్నది.