06-12-2024 12:33:24 AM
రాజేంద్రనగర్: కట్టుకున్నోడే ఆమె పాలిట కాలయముడు అయ్యాడు. కలకాలం కష్టసుఖాల్లో తోడునీడగా ఉంటానని బాస చేసినవాడే అంతం చేశాడు. ఈ సంఘటన ఆర్‌జీఐఏ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. శంషాబాద్ ఎయిర్‌పోర్టు కాలనీలో సాయికుమార్, సుమలత(33) దంపతులు అద్దె ఇంట్లో ఉంటున్నారు. మహేశ్వరం మండలం డబీల్‌గూడకు చెందని సుమలతను 11 ఏళ్ల క్రితం సాయికుమార్ వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. వివాహ సమయంలో సుమలత తల్లిదండ్రులు 16 తులాల బంగారం పెట్టి ఇతర లాంఛనాలతో ఘనంగా పెళ్లి చేశారు. అయితే, కొంతకాలంగా అదనపు కట్నం ఇవ్వాలని సాయికుమార్‌తోపాటు అతడి తల్లి ఇందిరమ్మ సుమలతను వేధించసాగారు.
ఈ క్రమంలో ఈనెల 3న రాత్రి మీ అక్కకు కడుపు నొప్పి ఉందని సుమలత సోదరుడు వెంకటేష్‌కు ఫోన్ చేసి చెప్పిన సాయికుమార్ అనంతరం తిరిగి ఇంటికి తీసుకెళ్లినట్లు చెప్పాడు. 4వ తేదీన తెల్లవారుజామున మరోమారు సాయికుమార్ బావమరిదికి కాల్ చేసి మీ అక్క చనిపోయిందని సమాచారం ఇచ్చాడు. దీంతో సుమలత తల్లిదండ్రులు, బంధువులు అంత్యక్రియలకు వచ్చారు. ఈక్రమంలో స్నానం చేయిస్తుండగా సుమలత మెడతోపాటు ముఖం ఇతర శరీరభాగాలపై గాయాలు కనిపించాయి. వెంటనే ఆమె తల్లిదండ్రులు అనుమానించారు. సాయికుమార్ ఆమెను హత్య చేశాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సాయికుమార్‌ను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. తన భార్య సుమలత ముఖంపై దిండు ఉంచి ఊపిరి ఆడకుండా చేసి చంపేసినట్లు తెలిపాడు. దీంతో అతడిపై గురువారం కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు.