06-12-2024 12:42:10 AM
ఖమ్మం, డిసెంబర్ 5 (విజయక్రాంతి)/సత్తుపల్లి: వచ్చే నాలుగేళ్లలో రాష్ట్రంలో పది వేల పరిశ్రమల ఏర్పాటు లక్ష్యంగా ప్రభు త్వం కార్యాచరణ సిద్ధం చేసుకుని ముందుకెళ్తుందని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడులో రూ.100 కోట్లతో నిర్మించిన మెగా ఫుడ్‌పార్క్‌ను గురువారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ .. ఔత్సాహిక పారిశ్రా మికవేత్తలను ప్రోత్సహిస్తామని, అందులో మహిళలకు పెద్దపీట కల్పిస్తున్నామని చెప్పారు.
పారిశ్రామిక ఉత్పత్తులను ప్రొత్సహించేందుకు మార్కెట్ సౌకర్యం కూడా కల్పిస్తున్నట్లు తెలిపారు. పరిశ్రమల ఏర్పాటు కోసం ముందుకు వచ్చిన ఔత్సాహికులకు అవసరమైన శిక్షణ కూడా ప్రభుత్వమే కల్పిస్తుందని చెప్పారు. మహిళా సంఘాలతో చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన శిక్షణను ప్రభుత్వం నిర్వహిస్తుందని చెప్పారు. మహిళలు చేసే ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు.
ప్రజా ప్రభుత్వంలో నూతనంగా రూపొందించిన ఎంఎస్‌ఎంఈ పాలసీ ప్రకారం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మహిళలకు ప్రత్యేక ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని శ్రీధర్‌బాబు తెలిపారు. ఖమ్మంలో 2,300 పైగా పరిశ్రమలు ఉన్నాయని, రాబోయే రోజుల్లో 10వేల పరిశ్రమలు ఏర్పాటు కావాలని ఆయన కాంక్షించారు. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు ఆహ్వానం పలుకుతామని, రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమలకు సబ్సిడీలు అందిస్తూ యువతకు ఉపాధి లభించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. ఖమ్మంలో పవర్ ప్లాంట్ ఏర్పాటు ప్రతిప్రాదనలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని మంత్రి చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో ఒక మహిళా పారిశ్రామిక పార్క్‌ను నిర్మించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని తెలిపారు. స్థల అన్వేషణ జరపాలని కలెక్టర్‌ను ఆదేశించారు.
ఫుడ్‌పార్క్‌లో అధిక పరిశ్రమలు: తుమ్మల
ఫుడ్‌పార్క్‌లో అధిక పరిశ్రమలు నెలకొల్పి, ఈ ప్రాంత రైతులు పండించే జామ, కొబ్బరికాయ, ఆయిల్‌పామ్ మొదలగు పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ అన్నారు. బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్ 200 ఎకరాలకు పైగా అందుబాటులో ఉందని, దీనిని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేవాలన్నారు. ఆహార శుద్ధి పరిశ్రమల ద్వారా రైతుల ఆదాయం పెరిగాలని, అటువంటి పరిశ్రమలు టీజీఐఐసీ అధికారులు తీసుకురావాలన్నారు.
వైఎస్సార్ హయాంలో శంకుస్థాపన చేసిన ఫుడ్‌పార్క్‌ను నాబార్డు నుంచి నిధులు తెచ్చి వసతులు కల్పించామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్‌రెడ్డి, ఖమ్మం సీపీ సునీల్‌దత్, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, జిల్లా పరిశ్రమల అధికారి సీతారాములు, జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య పాల్గొన్నారు.