calender_icon.png 27 September, 2025 | 6:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాంకేతిక నైపుణ్యం ఉంటేనే యువతకు ఉద్యోగాలు..

27-09-2025 05:12:55 PM

విద్యాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత..

అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను వర్చువల్ గా ప్రారంభం..

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశ్యం..

రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి చిన్నారెడ్డి..

ఆధునిక సాంకేతికతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ను ఏర్పాటు... కలెక్టర్ ఆదర్శ్ సురభి 

వనపర్తి శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి

వనపర్తి (విజయక్రాంతి): ప్రస్తుత ఆధునిక యుగంలో చదువుతో పాటు సాంకేతిక నైపుణ్యం ఉంటేనే యువతకు ఉద్యోగాలు లభిస్తాయని వనపర్తి శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి(MLA Thudi Megha Reddy) అన్నారు. శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి మల్లేపల్లి హైదరాబాద్ ఐ.టి.ఐ కళాశాల ప్రాంగణం నుండి నాలుగు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లతోపాటు రాష్ట్రంలోని 65 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను వర్చువల్ గా ప్రారంభించారు. వనపర్తిలోని నాగవరం శివారులో ఐటిఐ కళాశాల ప్రక్కన రూపాయలు 6.76 కోట్ల వ్యయంతో కొత్తగా నిర్మించిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ను సైతం ముఖ్యమంత్రి వర్చువల్ గా ప్రారంభోత్సవం చేశారు. వనపర్తి జిల్లాకు సంబంధించిన ఎ.టి.సి. ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు తూడి మెగారెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి చిన్నారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శాసన సభ్యులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ .రేవంత్ రెడ్డి రాష్ట్రంలో విద్యాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని దానితో పాటుగా సాంకేతికపరంగా విద్యార్థులకు నైపుణ్య శిక్షణ కల్పించి ఉపాధి పొందే విధంగా చర్యలు తీసుకుంటున్నారని అందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.  వనపర్తి జిల్లాలోని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు రూపాయలు 45.15 కోట్ల నిధులు ఖర్చవుతుందని అందులో రాష్ట్ర ప్రభుత్వం 6.76 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే మిగతా నిధులు మొత్తం టాటా సంస్థ వారు భరిస్తున్నారని తెలిపారు.  విద్యార్థులు కేవలం డిగ్రీలు పాస్ అయితే ఉద్యోగాలు రావడం లేదని గ్రహించిన రాష్ట్ర ముఖ్యమంత్రి టాటా సంస్థ వారితో మాట్లాడి పరిశ్రమలలో అవసరమైన సాంకేతిక నైపుణ్యాన్ని శిక్షణ ద్వారా విద్యార్థులకు అందించి పరిశ్రమలలో ఉపాధి పొందే విధంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 

వనపర్తి జిల్లాలోని విద్యార్థులు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ లో చదువుకొని మంచి పరిశ్రమల్లో ఉద్యోగాలు పొందాలని విద్యార్థులకు సూచించారు. మార్చి 2న రాష్ట్ర ముఖ్యమంత్రి వనపర్తి జిల్లాలో పర్యటించి వెయ్యి కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి నిధులు మంజూరు చేశారని అవి ప్రస్తుతం టెండర్లు పూర్తి అయినందున త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని తెలియజేశారు. చదువుకున్న నిరుద్యోగులకు వారి విద్యా, సాంకేతిక అర్హతలను బట్టి ఉద్యోగ అవకాశాలు పొందేందుకు ప్రభుత్వం డిట్ అనే పోర్టల్ ఏర్పాటు చేయడం జరిగిందని, జిల్లాలోని నిరుద్యోగులు డీట్ పోర్టల్ లో పేర్లు నమోదు చేసుకొని లబ్దిపొందాలని తెలియజేశారు.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే  ఉద్దేశ్యం... 

రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి చిన్నారెడ్డి 

రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో టాటా సంస్థ వారితో సమన్వయం చేసుకొని సంవత్సర కాల వ్యవధిలోనే మల్లెపల్లిలో 4, రాష్ట్ర వ్యాప్తంగా 65 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను ప్రారంభోత్సవం చేసినందుకు ముఖ్యమంత్రికి  ధన్యవాదాలు తెలుపుతున్నట్లు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి చిన్నారెడ్డి అన్నారు.  కేవలం థియరీ కొంత ప్రాక్టికల్ చదువులతో డిగ్రీలు పూర్తి చేస్తే ఉద్యోగాలు రావడంలేదని అందుకే టాటా సంస్థ వారితో ఒప్పందం చేసుకొని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆయా పరిశ్రమలలో ఉద్యోగులకు అవసరమైనటువంటి సాంకేతిక నైపుణ్యత అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లలో శిక్షణ ఇచ్చి కోర్సు పూర్తయ్యాక టాటా వారే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని అన్నారు.

విద్యార్థులకు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లో సీటు దొరికితే చదువు పూర్తి కాగానే ఉద్యోగం దొరికినట్లేనని విద్యార్థులకు భరోసా కల్పించారు. వనపర్తి జిల్లాకు త్వరలోనే ఇంజనీరింగ్ కళాశాల సైతం మంజూరు కాబోతుందని, జిల్లాలోని విద్యార్థులు మంచి చదువులు చదువుకొని వనపర్తి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ లో సీట్లు పొందిన విద్యార్థులకు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు తన శుభాకాంక్షలు తెలిపారు.

ఆధునిక సాంకేతికతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ను ఏర్పాటు...

కలెక్టర్ ఆదర్శ్ సురభి 

అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు దాదాపు 40 కోట్లు ఖర్చవుతుందని అందులో రాష్ట్ర ప్రభుత్వం పది శాతం నిధులు మంజూరు చేసి మిగిలిన 90 శాతం టాటా సంస్థ వారు ఖర్చు చేసి అన్ని ఆధునిక సాంకేతిక యంత్రాలు, పనిముట్లతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు . ఈ ఏటీసీలో ఆటోమేషన్, ఎలక్ట్రికల్ వెహికల్, రోబోటిక్ వంటి ఆధునిక కోర్సులు ఉన్నాయని, జిల్లాలోని విద్యార్థులు ఈ ఎ.టి.సి సెంటరు ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎ.టి.సి సెంటర్లో ఈ విద్యా సంవత్సరంలో 176 సీట్లు ఉన్నాయని, వచ్చే సంవత్సరం సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. జిల్లాలోని విద్యార్థులు సాంకేతిక నైపుణ్య శిక్షణ పొంది ఉద్యోగాలు పొందాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ లో చేరిన విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ ఇచ్చి విజయవంతం చేయాలని కోరారు. మార్కెట్ కమిటి చైర్మన్ పి శ్రీనివాస్ గౌడ్, ప్రిన్సిపాల్ రమేష్ బాబు, అధ్యాపకులు, విద్యార్థులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.