calender_icon.png 27 September, 2025 | 7:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలి

27-09-2025 05:22:34 PM

గద్వాల,(విజయక్రాంతి): యువతను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్‌లో శిక్షణ పొంది,ఆధునిక నైపుణ్యాలను అభ్యసించి, భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ అన్నారు. శనివారం గద్వాల్ పట్టణంలోని ఆధునాతన సాంకేతిక కేంద్రం నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,రాష్ట్ర ప్రభుత్వం అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు ద్వారా యువతకు నాణ్యమైన నైపుణ్య శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు.

పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు విద్యార్థులకు అందించేందుకు టాటా సంస్థ సహకారంతో వివిధ కోర్సులు ఏటీసీలో విద్యార్థులకు నేర్పిస్తున్నామని అన్నారు. మన జిల్లాలో ఏ.టి.సి లో 172 మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారని తెలిపారు. జిల్లాలో ప్రభుత్వం ఈ సెంటర్ ఏర్పాటు కోసం రూ.45 కోట్లు ఖర్చు చేసిందని, ప్రతి విద్యార్థికి 2,000 స్టైపెండ్ అందించనున్నట్లు  తెలిపారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు విద్యార్థులకు ఆధునిక సదుపాయాలు, ప్రపంచ స్థాయి ల్యాబ్‌లు,ఇండస్ట్రీ 4.0 మెషినరీతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, రోబోటిక్స్, కంప్యూటర్ ఆధారిత డిజైన్ వంటి నైపుణ్యాలను, నిపుణుల పర్యవేక్షణలో రియల్ టైం శిక్షణతో అందిస్తున్నామని తెలిపారు.

భారతదేశంలో నూటనలభై కోట్ల జనాభాలో యువత ప్రధాన శక్తిగా ఉండగా, ఈ సమకాలీన ప్రపంచంలో ఉన్నత స్థాయికి చేరడానికి నైపుణ్యాలు అత్యంత కీలకమని తెలిపారు. జపాన్,సౌత్ ఆఫ్రికా, జర్మనీ వంటి దేశాల్లో జనాభా తక్కువగా ఉండటంతో, మంచి నైపుణ్యాలను అభ్యసించిన యువత ఆ దేశాల్లో వెళ్ళి అన్ని రంగాల్లో విజయం సాధించగలరని తెలిపారు. ప్రతి సంవత్సరం లక్షలాది ఇంజనీర్లు పాస్ అవుతున్నప్పటికీ సరైన నైపుణ్యాలు లేక ఉద్యోగాలు రాకపోవడం సాధారణ సమస్యగా ఉండటం వలన,ప్రతి విద్యార్థి తన స్కిల్స్‌ను అభివృద్ధి చేసుకుని అన్ని రంగాల్లో ముందుకు వెళ్లడం అత్యవసరమని ఆయన చెప్పారు.

మంచి నైపుణ్యాలను అభ్యసిస్తే, దేశంలోనే కాక,జపాన్, సౌత్ కొరియా,జర్మనీ వంటి ఇతర దేశాల్లోనూ అన్ని రంగాల్లో సులభంగా ఉద్యోగ అవకాశాలను పొందగలరని తెలిపారు. హైదరాబాద్ మల్లేపల్లి ఐటీఐ వేదికగా అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్స్ (ATCs) ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించగా, జిల్లా కలెక్టర్ ఆ కార్యక్రమాన్ని అందరితో కలిసి వీక్షించారు. ఈ కార్యక్రమంలో సహాయ లేబర్ కమిషనర్ మహేష్ కుమార్,జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి ప్రియాంక, ఐటిఐ కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.