లక్ష్యం.. డబుల్ డిజిట్

25-04-2024 01:17:17 AM

l రాష్ట్రంపై బీజేపీ ఫోకస్

l ప్రారంభం నుంచి ఆ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న తెలంగాణ

l రాష్ట్రంలోని పరిస్థితులు కలిసి వస్తాయని ధీమా

హైదరాబాద్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి) : ఫినిక్స్ పక్షిలా బీజేపీ కూడా రాజకీయ క్షేత్రంలో పోరాడి విజయం సాధించింది. 1980లో పార్టీ ఏర్పాటు తర్వాత బీజేపీ తొలిసారి పోటీ చేసిన ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కేవలం రెండే సీట్లు కైవసం చేసుకోగా.. అందులో ఒకటి తెలంగాణ నుంచి గెలవడం కావడం విశేషం. తొలిసారి జరిగిన ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుని రెండు సీట్లలో పోటీ చేస్తే హన్మకొండలో గెలిచి సికింద్రాబాద్‌లో ఓడింది. అయితే ఆ ఎన్నికలు బీజేపీ చరిత్రను మార్చాయి. పార్టీని స్థాపించిన అటల్ బిహారీ వాజ్‌పేయి, లాల్ కృష్ణ అద్వానీ వంటి అతిరథులు ఓడిపోయారు.

ఇందిరా గాంధీ హత్య తర్వాత ఎన్నికలు రావడంతో బీజేపీ ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయింది. అయితే అంతటి కాంగ్రెస్ గాలి వీచిన చోట తెలంగాణలో మాత్రం సి.జంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పీవీ నర్సింహారావుపై విజయం సాధించారు. ఆ విధంగా తెలంగాణలో బీజేపీకి ఆయన పునాది వేశారని చెప్పవచ్చు. ఇక ఆ తర్వాత 1989లో ఒక్క ఎంపీ సీటు కూడా గెలుచుకోలేకపోయింది. 1991లో సికింద్రాబాద్ నుంచి బండారు దత్తాత్రేయ విజయం సాధించారు. 1996లో జరిగిన ఎన్నికల్లోనూ బీజేపీ మళ్లీ సున్నాకు పడిపోయింది. 1998లో మాత్రం బీజేపీ బాగా పుంజుకుంది. అందుకు కారణం కూడా ఉంది. అప్పుడు ఒక్క ఓటు.. రెండు రాష్ట్రాలు అంటూ కాకినాడలో ఆ పార్టీ తీర్మానం చేసింది. ఫలితంగా తెలంగాణలో సికింద్రాబాద్‌లో బండారు దత్తాత్రేయ, కరీంనగర్‌లో సీహెచ్ విద్యాసాగర్ రావు విజయం సాధించారు.

1999లో జరిగిన ఎన్నికల్లో కరీంనగర్ నుంచి సీహెచ్ విద్యాసాగర్ రావు, సికింద్రాబాద్‌లో బండారు దత్తాత్రేయ, మహబూబ్‌నగర్‌లో ఏపీ జితేందర్ రెడ్డి, మెదక్ నుంచి ఆలె నరేంద్ర విజయం సాధించి కమలం సత్తా చాటారు. అంత ఎగిసిన బీజేపీ తిరిగి 2004కు వచ్చేసరికి ఒక్కసారిగా నేలచూపులు చూడాల్సి వచ్చింది. ఆ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సీటును కూడా గెలవలేకపోయింది. 2009 ఎన్నికల్లోనూ అదే పునరావృతం అయింది. ఇక తెలంగాణ ప్రాంతంలో బీజేపీ పని అయిపోయింది అనుకునే లోపు రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో బీజేపీ తిరిగి సికింద్రాబాద్ ఎన్నికల్లో విజయం సాధించింది.

దత్తాత్రేయకు కేంద్ర మంత్రి వర్గంలో కూడా చోటు దక్కింది. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఎలా బీజేపీ గ్రాఫ్ పెరిగిందో తెలంగాణలోనూ అదే స్థాయిలో పెరిగింది. క్రమంగా బలం పుంజుకున్న బీజేపీ 1999 మాదిరిగా తిరిగి సత్తా చాటింది. 2019 ఎన్నికల్లో ఆదిలాబాద్‌లో సోయం బాపూరావు, కరీంనగర్‌లో బండి సంజయ్, నిజామాబాద్‌లో ధర్మపురి అరవింద్, సికింద్రాబాద్‌లో జి.కిషన్ రెడ్డి విజయం సాధించారు. వీరిలో కిషన్ రెడ్డికి కేబినెట్ హోదాతో కేంద్ర మంత్రి పదవి కూడా లభించింది. 

ఒక్కటి నుంచి మొదలు పెట్టి... 

1984లో కేవలం ఒక్కటంటే ఒక్క సీటు సాధించి ఈ ప్రాంతంలో బీజేపీ పాగా వేసింది. ఆ తర్వాత క్రమంగా తన బలాన్ని పెంచుకుంటూ వచ్చింది. 1989, 1996, 2004, 2009లో జరిగిన ఎన్నికల్లో ఒక్క చోట కూడా గెలవకపోయినా ఆ పార్టీ మాత్రం ఆశను వదులుకోలేదు. ఎక్కడ తప్పులు జరుగుతున్నాయో తెలుసుకుని క్రమంగా ఆ బలహీనతలను అధిగమిస్తూ ఎన్నికల బరిలో నిలుస్తూ వస్తోంది. 1996, 1998, 1999 ఎన్నికల్లో బీజేపీ దేశంలో అతి పెద్ద పార్టీగా అవతరించిన సమయంలో 1996లో మినహా రాష్ట్రంలో పార్టీ చక్కని ఫలితాలే సాధించింది. 2004, 2009లో పడిపోయిన పార్టీ 2014కు వచ్చేసరికి మోదీ నాయకత్వంలో తిరుగులేని విజయం సాధించింది.

అప్పుడు కేవలం రాష్ట్రం నుంచి ఒకే ఒక ఎంపీ గెలిచారు. కానీ 2019లోకి వచ్చే సరికి నలుగురు ఎంపీలను ఢిల్లీకి పంపింది తెలంగాణ. రాష్ట్రంలో పార్టీ నాయకులతో పాటుగా వీహెచ్‌పీ, ఆర్‌ఎస్‌ఎస్ సంఘాలు కూడా బీజేపీ బలోపేతానికి తమ వంతు కృషి చేశాయి. ఈసారి డబుల్ డిజిట్ సాధించడమే లక్ష్యంగా పార్టీ నేతలు కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం బీఆర్‌ఎస్ పార్టీ తిరోగమనంలో ఉందని, కేవలం 4 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని బీజేపీ నేతలు అంటున్నారు. అటు బీఆర్‌ఎస్, ఇటు కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు తమకు అనుకూలంగా మారతాయని కమలనాథులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మోదీ హవా, రామ మందిర నిర్మాణం, సీఏఏ, సరిహద్దుల్లో భద్రత... ఇలా అనేక అంశాలు తమకు కలిసివస్తాయని ఆ పార్టీ భావిస్తోంది. 

ఆది నుంచి హైదరాబాద్‌లో గట్టి పోటీ

రాష్ట్రంలో బీజేపీ మొదటి నుంచి హైదరాబాద్ సీటు సాధించడమే లక్ష్యంగా గట్టి పోటీ ఇస్తూనే ఉంది. మొదట్లో టీడీపీకి మద్దతునిచ్చిన బీజేపీ 1998 ఎన్నికల్లో తొలిసారిగా ఎంఐఎంపై పోటీ చేసింది. సలావుద్దీన్ ఒవైసీకి 4,85,785 ఓట్లు రాగా.. బాల్‌రెడ్డికి 4,14,173 ఓట్లు పోలయ్యాయి. కేవలం 6.58 శాతం ఓట్ల తేడాతో ఓడిపోయింది. అదే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 8.71 శాతం, టీడీపీకి 7 శాతం ఓట్లు పోలయ్యాయి.  ముస్లిం ఓట్లు మాత్రం గంపగుత్తగా ఎంఐఎంకు పడితే హిందూ ఓట్ల విభజన జరుగుతోందని భావించిన బీజేపీ.. ఆ అంశం పై సీరియస్‌గా దృష్టి సారించింది. 1998 ఎన్నికల్లోనూ మజ్లిస్ 41.36 శాతం ఓట్లు, బీజేపీ 35.74 శాతం ఓట్లను సాధించాయి.

ఈసారి కూడా కాంగ్రె స్ 18.51 శాతం ఓట్లు సాధించడం బీజేపీ ఓటమికి కారణం అయింది. 2004 ఎన్నికల్లో బీజేపీ తరఫున సుభాష్ చందర్ జీ పోటీ చేసి రెండో స్థానం సాధించగా, 2009లో మాత్రం బీజేపీ కేవలం 5.42 శాతం ఓట్లను మాత్రమే సాధించింది. 2014లో 17 శాతం, 2019లో 26.8 శాతం ఓట్లను మాత్రమే సాధించి ఢీలా పడింది. 1998లో తొలిసారి పోటీ చేసినప్పుడు గెలుపు వరకు వచ్చి క్రమంగా 2014 వరకు తిరోగమనం దిశగా పయనించింది. 2024 ఎన్నికల సమయానికి తిరిగి పుంజుకుని గెలుపే లక్ష్యంగా పోరాడుతోంది. ఆ పార్టీ అభ్యర్థి మాధవీలత.. ఒవైసీ కంచుకోటలోనే ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఈసారి ఫలితం తమకు అనుకూలంగా ఉండనుందని ఆ పార్టీ అంచనా వేస్తోంది.