కాంగ్రెస్ అభ్యర్థులు ముగ్గురు వారే

25-04-2024 01:21:29 AM

l జాబితా విడుదల చేసిన ఏఐసీసీ 

l రామసహాయం రఘురామిరెడ్డికి ఖమ్మం  

l కరీంగనర్‌కు వెలిచాల రాజేందర్‌రావు 

l హైదరాబాద్‌కు మహమ్మద్ సమీర్ 

l ఖమ్మం వరంగల్ పట్టభుద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు తీన్మార్ మల్లన్న 

హైదరాబాద్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీలో టికెట్ల ఉత్కంఠ వీడింది. ఎట్టకేలకు పెండింగ్‌లో ఉన్న మూడు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. టికెట్ల కోసం తీవ్ర పోటీ ఉండటంతో అధిష్ఠానం రాష్ట్ర నాయకులతో చర్చించి, నామినేషన్‌కు ఒక రోజు మందు నిర్ణయం తీసుకున్నది. ఖమ్మం అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డి, కరీంనగర్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్‌రావు, హైదరాబాద్ అభ్యర్థిగా మహమ్మద్ సమీర్‌తో కూడిన జాబితాను ఏఐసీసీ ప్రకటించింది. మరోవైపు త్వరలో జరగబోయే ఖమ్మం నల్లగొండ వరంగల్  పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నను ప్రకటించింది. తీన్మార్ మల్లన్న ఇదే నియోజక వర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి.. బీఆర్‌ఎస్ బలపర్చిన పల్లా రాజేశ్వరెడ్డిచేతిలో ఓడిపోయారు.  

వియ్యంకుడికి టికెట్ ఇప్పించుకున్న పొంగులేటి..  

ఖమ్మం లోక్‌సభ టికెట్ కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆయన సతీమణి నందిని, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తన సోదరుడు ప్రసాద్‌రెడ్డి, మరో మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఆయన తనయుడు యుగంధర్‌తోపాటు పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు, ఇతర నేతలు టికెట్ కావాలని పట్టుపట్టారు. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు తమ వారసులకు టికెట్ కావాలని కోరడంతో.. సీఎం రేవంత్‌రెడ్డి కూడా తుది నిర్ణయం అధిష్ఠానానికే వదిలేశారు. కొత్తవారికి టికెట్ ఇవ్వాలని అధిష్ఠానం నిర్ణయం తీసుకోవడంతో మంత్రి పొంగులేటి తన వియ్యంకుడు రామసహాయం రఘురాంరెడ్డి పేరును తెరపైకి తీసుకొచ్చారు.

రఘురాంరెడ్డి తండ్రి సురేందర్‌రెడ్డి గతంలో పలుమార్లు ఎమ్మెల్యే, ఎంపీగా పని చేశారు. సోదరుడికి టికెట్ ఇవ్వకపోతే.. వియ్యంకుడు రాఘురాంరెడ్డికి టికెట్ ఇప్పించుకున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇక కరీంనగర్ విషయంలోనూ పెద్ద టాస్కే నడిచింది. మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, పార్టీ సీనియర్ నేత వెలిచాల రాజేందర్‌రావు మధ్య గట్టిపోటీనే నడిచింది. అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్ టికెట్ ఆశించిన ప్రవీణ్‌రెడ్డిని కాదని మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. అప్పుడు ఎంపీ టికెట్ ఇస్తామని ప్రవీణ్‌రెడ్డికి హామీ ఇచ్చారు. ఇప్పుడు తెరపైకి వెలిచాల రాజేందర్‌రావు రావడం.. టికెట్ ఖరారు కాకముందే ఆయనతో మంత్రి పొన్నం ప్రభాకర్ నామినేషన్ వేయించారు. అయితే అధిష్ఠానం సూచనల మేరకే నామినేషన్ వేశామని మంత్రి పొన్నం చెప్పారు. ఎంపీ టికెట్ ఇస్తామన్న హామీని పార్టీ నిలబెట్టుకోలేదని ప్రవీణ్‌రెడ్డి ఆగ్రహంతో ఉన్నారు.  

వీహెచ్‌కు మొండి చెయ్యి.. 

పీసీసీ మాజీ అధ్యక్షుడు, పార్టీ సీనియర్ వీ హనుమంతరావుకు కాంగ్రెస్ అధిష్ఠానం మొండి చెయ్యి చూపించింది. ఖమ్మం ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవడమే కాకుండా ఆయన గత ఐదేండ్లుగా ఖమ్మం జిల్లాలో పని చేసుకుంటున్నారు. నిత్యం పార్టీ కార్యక్రమాలకు వెళ్లడంతో.. జిల్లా నేతలకు అందుబాటులో ఉంటున్నారు. అయితే బీసీ వర్గానికి చెందిన వీహెచ్ పేరును కనీసం పరిశీలనలోకి  తీసుకోకపోవడంతో బీసీ వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి.

మల్కాజిగిరి కాంగ్రెస్ రెబల్‌గా నామినేషన్ వేస్తా: కేంద్ర మాజీ మంత్రి సర్వే  

మల్కాజిగిరి పార్లమెంట్, కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు కాంగ్రెస్ రెబల్‌గా నామినేషన్ వేస్తున్నట్టు కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తుమ్మితే ఊడిపోయే స్థితిలో ఉన్నదన్నారు. కాంగ్రెస్ పార్టీలో మాదిగలకు అన్యాయం జరుగుతోందని, గతంలో ఎన్నడూ ఈ పరిస్థితి లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజక వర్గంలో మాదిగల ఓట్లు 40 వేల నుంచి 50 వేల వరకు ఉంటాయని చెప్పారు. తెలంగాణలో మూడు ఎంపీ సీట్లు ఎస్సీ రిజర్వుడుగా ఉంటే.. ఒకటి కూడా మదిగలకు ఇవ్వలేదని, ఆ ప్రభావం ఎంపీ ఎన్నికల్లో పడుతుందని హెచ్చరించారు.   

నేడే ఆర్‌ఆర్‌ఆర్ నామినేషన్ 

ఖమ్మం, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ ఖమ్మం లోక్ సభ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేస్తారని రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు రేణుకాచౌదరి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు తదితరుల సమక్షంలో నామినేషన్ వేయనున్నట్టు పేర్కొన్నారు. నామినేషన్ సందర్భంగా ఉదయం 10 గంటలకు నగరంలోని కాల్వొడ్డు నుంచి ర్యాలీ బయలుదేరి మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగుతుందని తెలిపారు.