ఎయిర్ ఇండియా కొత్త నిబంధనలు

06-05-2024 01:03:57 AM

ఫ్రీ బ్యాగేజీ పరిమితి తగ్గింపు

మే 2 నుంచే అమల్లోకి

న్యూఢిల్లీ, మే 5: ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ తన బ్యాగేజీ పాలసీలో పలు మార్పులు చేసింది. ప్రయాణికుల టికెట్ ధరను బట్టి దేశీయ బ్యాగేజీ విధానాన్ని మార్చింది. గతంలో 20 కేజీల వరకు తీసుకెళ్లే అవకాశం ఉండగా, ఈ కొత్త నిబంధనలతో గరిష్టంగా 15 కేజీలకు కుదించింది. మే 2 నుంచే ఈ మార్పులు అమల్లోకి వచ్చాయని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది. వాస్తవానికి ఇంతకుముందు ఎయిర్ ఇండియా 25 కిలోల బ్యాగేజీ తీసుకెళ్లడానికి అనుమతి ఇచ్చేది. అయితే ఎయిర్ ఇండియా.. టాటా గ్రూప్ చేతికి వచ్చాక గత ఏడాది ఆ పరిమితిని 20 కిలోలకు తగ్గించారు. డీజీసీఏ ఆదేశాల ప్రకారం విమానయాన సంస్థలు కనీసం 15 కేజీల బ్యాగేజీని ఉచితంగానే అనుమతించాల్సి ఉంటుంది. అందుకే దాదాపు అన్ని ఎయిర్‌లైన్స్ సంస్థలు ఈ మేరకు ఫ్రీ బ్యాగేజీని అనుమతిస్తున్నాయి. 

కంఫర్ట్, కంఫర్ట్ ప్లస్, ఫ్లెక్స్..

ఎయిర్ ఇండియా గత ఏడాది వివిధ రకాల ఫేర్ క్లాసెస్‌లను ప్రవేశపెట్టింది. వీటిలో కంఫర్ట్, కంఫర్ట్ ప్లస్, ఫ్లెక్స్ పేరిట మూడు తరగతులను తీసుకొచ్చింది. వీటి టికెట్ ధరలు, సౌకర్యాలు వేర్వేరుగా ఉంటాయి. కంఫర్ట్, కంఫర్ట్ ప్లస్ కేటగిరీ టికెట్ తీసుకుంటే 15 కిలోల బ్యాగేజీ వరకు, ఫ్లెక్స్ కేటగిరీ టికెట్ తీసుకుంటే 25 కేజీల వరకు అనుమతి ఇస్తారు. ప్రీమియం ఎకానమీకి కూడా మార్పులు చేశారు. ఇక్కడ కంఫర్ట్ ప్లస్‌లో 30 కిలోలకు బదులుగా 15 కిలోలు, ఫ్లెక్స్‌లో 35 కిలోలకు బదులుగా 25 కిలోల లగేజీని మాత్రమే తీసుకెళ్లే అవకాశం కల్పించారు. అదే విధంగా కంఫర్ట్ ప్లస్‌లో బిజినెస్ తరగతి ప్రయాణికులకు 35 నుంచి 25 కిలోలకు పరిమితి విధించారు. ఫ్లెక్స్ ప్రయాణికులు గతంలో అనుమతించిన 40 కిలోలకు బదులుగా 35 కిలోల పరిమితిని అందుకుంటారు. దీనిపై ఎయిర్ ఇండియా ప్రతినిధి మాట్లాడుతూ.. ప్రయాణికులు అనేక రకాల ప్రాధాన్యతలను కలిగి ఉన్నందున వారికి అవసరాలకు తగినట్లుగా చార్జీలు, సేవలను రూపొందించినట్లు వెల్లడించారు.