calender_icon.png 25 May, 2025 | 2:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆడబిడ్డలను మళ్లీ ఫెయిల్ చేశారుl

06-05-2024 01:06:33 AM

బిజ్‌భూషణ్ కుమారుడికి టికెట్ ఎలా ఇస్తారు?

అత్యాచార నిందితులకు ప్రధాని అండదండలు

ప్రధాని మోదీపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు

న్యూఢిల్లీ, మే 5: మహిళా రెజ్లింగ్ క్రీడాకారులపై లైంగికదాడులకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఫ్‌ఐ) మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌శరణ్‌సింగ్ కుమారుడికి బీజేపీ లోక్‌సభ ఎన్నికల టికెట్ ఇవ్వటంపై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు గుప్పించింది. దేశంలో మహిళలు, యువతులపై అత్యాచారాలకు పాల్పడిన నేరస్తులను ప్రధాని నరేంద్రమోదీ రక్షిస్తున్నారని ఆరోపించింది. నేరస్తులకు కొమ్ముకాస్తున్నారని కాంగ్రెస్ నేత జైరాంరమేశ్ ఆదివారం ఎక్స్‌లో మండిపడ్డారు. ‘మోదీ ఇండియాలో మహిళలకు ఇక ఎప్పటికీ రక్షణ ఉండదా? దేశపు ఆడబిడ్డల రక్షణకంటే ప్రధాని అధికార దాహమే ఎప్పుడూ ప్రధానమవుతున్నది. బీజేపీ ఇస్తున్న నారీ శక్తి ఓ నినాదం మాత్రమే. మోదీ పరివార్‌లో మహిళలపై లైంగిక హింసకు పాల్పడినవారికే ఆశ్రయం లభిస్తున్నది. ప్రజ్వల్ రేవణ్ణ కావచ్చు.. బ్రిజ్‌భూషణ్ కావచ్చు. ప్రధాని వారిని ఎప్పుడూ రక్షిస్తూనే ఉన్నారు. బ్రిజ్‌భూషణ్ కుమారుడికి ఎంపీ టికెట్ ఇచ్చి భారతీయ కూతుళ్లను మళ్లీ ఫెయిల్ చేశారు అని ఆగ్రహం వ్యక్తంచేశారు.