09-08-2025 12:02:40 AM
అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను ఫోర్త్ కొలాబరేషన్‌లో వస్తున్న తాజాచిత్రం ‘అఖండ 2: తాండవం’. వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘అఖండ’కు సీక్వెల్‌గా రూపొందుతోందీ సినిమా. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తుండగా ఎం తేజస్విని నందమూరి సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. ఇందులో హీరోయిన్ సంయుక్త మీనన్ ముఖ్యపాత్రలో నటిస్తోంది.
ఆది పినిశెట్టి ఓ కీలక పాత్రలో కనిపించనుండగా, హర్షాలి మల్హోత్రా ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. వచ్చే దసరా పండుగ కానుకగా సెప్టెంబర్ 25న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. రిలీజ్ సమీపిస్తుండటంతో చిత్రబృందం నిర్మాణానంత పనులను పరుగులు పెట్టిస్తోంది.
డబ్బింగ్, సీజీ వర్క్, రీ-రికార్డింగ్ తదితర టెక్నికల్ పనులన్నీ నెలాఖరుకల్లా పూర్తయి, మరో మూడు వారాల్లో ఫస్ట్ కాపీ సిద్ధం కానుంది. కథానాయకుడు బాలకృష్ణ డబ్బింగ్ పనులు శుక్రవారంతో ముగిశాయని టీమ్ అధికారికంగా వెల్లడించింది. ఈ చిత్రానికి సంగీతం: థమన్; డీవోపీ: రాంప్రసాద్, సంతోష్ డీ డెటాకే; ఫైట్స్: రామ్-లక్ష్మణ్; ఆర్ట్: ఏఎస్ ప్రకాశ్; ఎడిటర్: తమ్మిరాజు.