calender_icon.png 11 December, 2025 | 8:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రశాంతంగా తొలిదశ గ్రామ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

11-12-2025 06:32:30 PM

సీపీ గౌస్ ఆలం..

కరీంనగర్ క్రైం (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లాలో తొలిదశ గ్రామ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ శాంతియుత వాతావరణంలో కొనసాగుతుందని కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌస్ ఆలం తెలిపారు. గురువారం మొదటి దశ ఎన్నికలు జరుగుతున్న ఐదు మండలాల్లోని పలు ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఆయన ప్రత్యక్షంగా సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని అధికారులకు, సిబ్బందికి సూచించారు. ఓట్ల లెక్కింపు జరుగుతున్న ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టామని, సరిపడా బలగాలను కేటాయించామని తెలిపారు.

ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే 5 మండలాల పరిధిలో 163 సెక్షన్ (భారతీయ నాగరిక సురక్ష సంహిత) అమలులో ఉందని సీపీ స్పష్టం చేశారు. ఈ సెక్షన్ ప్రకారం, ఐదు కంటే ఎక్కువ మంది గుమిగూడటం నిషేధమని తెలిపారు. గెలిచిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించుట పూర్తిగా నిషేధమని తెలిపారు. ఈ నియమాలను ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుని, కేసులు నమోదు చేస్తామని సీపీ హెచ్చరించారు.