24-05-2025 05:54:01 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రేపు జరగబోయే గ్రామ పాలన అధికారుల రాత పరీక్ష ఏర్పాట్లను శనివారం జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్(District Collector Adwait Kumar Singh), అదనపు కలెక్టర్ కె.వీరబ్రహ్మ చారీతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పరీక్షా కేంద్రంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఏర్పాటు చేయాలన్నారు. పరీక్ష కేంద్రం దగ్గరలోని నోటీస్ బోర్డులో సీటింగ్ అమరికను పరిశీలించారు.
ఈ సీటింగ్ అమరిక, తరగతి గదిలోని సీటింగ్ ఒకేలా ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కంప్యూటర్ గదిని పరిశీలించారు. ఎలక్ట్రిసిటీ, త్రాగునీరు, తదితర మౌళిక వసతులు ఏర్పాటు చేయాలన్నారు. నిర్వహణపై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. అవకతవకలకు ఆస్కారం లేకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట డి.ఈ.ఓ డాక్టర్ ఏ.రవీందర్ రెడ్డి, స్థానిక ఎం.ఆర్.ఓ చండ్ర రాజేశ్వర్, పట్టణ సి.ఐ పి.దేవేందర్, సి.సెక్షన్ సూపరింటెండెంట్ వినోద్, ఈ.డి.యం ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.