24-05-2025 05:46:13 PM
హుజూరాబాద్ (విజయక్రాంతి): దళితబంధు రెండవ విడత నిధులు వెంటనే విడుదల చేయాలని కోరుతూ కరీంనగర్ జిల్లా(Karimnagar District) హుజూరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో దళితబంధు సాధన సమితి ఆధ్వర్యంలో శనివారం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించి, నిరసన తెలిపారు. ఈ సందర్భంగా దళితబంధు సాధన సమితి సభ్యులు మాట్లాడుతూ.. దళితబందు రెండవ విడత నిధులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంజూరు ప్రక్రియలో మొదటి ప్రాధాన్యతగా రూ. 5లక్షలు పెండింగ్లో ఉన్నవాళ్లకు పథకం అమలు చేయాలని అన్నారు.
వెయ్యి రూపాయల నుండి లక్ష వరకు పెండింగ్లో ఉన్న వాళ్లకు మొదటగా మంజూరు చేస్తే ఉద్యమం ఉధృతం చేస్తామని అన్నారు. మొదటి విడతగా వాహనాలు తీసుకున్న వారికి, మిగిలిన డబ్బులలో ఒక్క రూపాయి మంజూరు చేసినా సహించేది లేదని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ వచ్చేలోపు పూర్తిస్థాయిలో నిధులు విడుదల చేయాలని అన్నారు. మే 30లో గ్రౌండింగ్ మొదలుపెట్టకపోతే 5 వేల మందితో కలెక్టర్ కార్యాలయం ముట్టడి చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్, జిల్లా మంత్రి ఇంటి ముట్టడికి సైతం వెనకాడబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దళితబందు సాధన సమితి సభ్యులు శనిగరపు రవీందర్, పాత రాజేష్, వంశీ, సౌజన్య, కోమల, సమ్మక్క, సరిత, భాగ్య, తదితరులు పాల్గొన్నారు.