16-07-2025 12:00:00 AM
కలెక్టర్ సిక్తా పట్నాయక్
నారాయణపేట జూలై 15(విజయక్రాంతి): నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఎంఈవో కార్యాలయం ఆవరణలో గల భవిత కేంద్రాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆకస్మి కంగా తనిఖీ చేశారు. ఆ కేంద్రంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలు మొత్తం ఎంతమంది ఉన్నారని, వారికి విద్యా బోధన ఎలా చేస్తున్నారని ఆమె అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు నాణ్యతతో కూడిన మధ్యాహ్న భోజనం అందించాలన్నారు.
విద్యా బోధన పరికరాలను, రిజిస్టర్లను కలెక్టర్ పరిశీలించారు. పిల్లలకు రవాణా ఛార్జీలు ఎలా చెల్లిస్తునారని ఆరా తీశారు. కేంద్రంలో వాష్ బేసిన్, మరుగు దొడ్లు లేకపోవండపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పక్కనే మరుగుదొడ్లు ఉన్నాయని, కానీ నీటి వసతి లేక నిరుపయోగంగా మారాయని ఎంఈవో బాలాజీ కలెక్టర్ కు తెలపడంతో స్పందించిన కలెక్టర్ ఒక్కరోజులో మరుగుదొడ్లకు నీటి వసతి కల్పించి మరుగుదొడ్లను వినియోగంలోకి తీసుకురావాలని మున్సిపాలిటీ కమిషనర్, ఎంపీడీఓను ఆదేశించారు. ఎమ్మార్సీ భవనాన్ని కూడా ఆమెపరిశీలించారు.