16-07-2025 02:49:15 PM
ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ పిలుపు
మహబూబాబాద్, (విజయక్రాంతి): నైజాం సర్కార్ లో పెద్ద పెద్ద మ్రానులతో దట్టమైన అడవిగా ప్రసిద్ధిగాంచి మ్రానుకోటగా పేరు గడించిన మానుకోట ను తిరిగి మ్రానుకోటగా తీర్చిదిద్దడానికి సంఘటిత కృషి చేయాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్(MLA Bhukya Murali Nayak ) పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ, అడవుల పెంపకాన్ని ప్రోత్సహించి, ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి చెట్లుగా ఎదగడానికి కృషి చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈదుల పూసపల్లి చెరువు వద్ద ఎకో టూరిజం పథకంలో ఏర్పాటుచేసిన వాకింగ్ ట్రాక్, రోప్ వే, లేక్ వ్యూ ఏర్పాటు చేస్తామని చెప్పారు. 2.20 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. జిల్లాలో 50 లక్షల మొక్కలను నాటేందుకు ప్రణాళిక రూపొందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, నాటిన ప్రతి మొక్క చిత్తుగా ఎదిగేందుకు కృషి చేయాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించి, పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలన్నారు. అనంతరం జమాండ్లపల్లి లో ఏర్పాటుచేసిన నందనవనం అర్బన్ పార్క్, వాచ్ టవర్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, జిల్లా అటవీశాఖ అధికారి విశాల్ బత్తుల, అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, ఫారెస్ట్ అధికారులు వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్ రావు, జ్యోష్ణా దేవి, సురేష్, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.