calender_icon.png 16 July, 2025 | 6:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి రిటైర్డ్ కార్మికులకు క్వార్టర్లు ఇవ్వాలి

15-07-2025 11:30:08 PM

మందమర్రి,(విజయక్రాంతి): సింగరేణి అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసిన సింగరేణి రిటైర్డ్, మెడికల్ ఇన్ వ్యాలిడేషన్ అయిన కార్మికులకు సింగరేణి యాజమాన్యం మిగిలి ఉన్న క్వార్టర్ లను కేటాయించాలని లేదా 150 గజాల స్థలాన్ని కేటాయించాలని సింగరేణి రిటైర్డ్ ఉద్యోగుల కార్మిక సంఘం నాయకులు కోరారు. మంగళవారం పట్టణ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ... 11వ వేతన ఒప్పందంలో పెరిగిన వేతనాల ప్రకారం 2021 తర్వాత దిగిపోయిన కార్మికులకు పెరిగిన రివైజ్డ్ పెన్షన్ ను మూడు దఫాలుగా అందజేయడం జరిగిందని, మిగిలిన వారికి సైతం పెరిగిన పెన్షన్ ఆర్డర్ కాపీలు వారి వారి గనులపై ఇవ్వడం జరుగుతుందని రిటైర్డ్ కార్మికులు గమనించాలని సూచించారు. అదేవిధంగా పెన్షన్ ఆర్డర్ కాపీలు రాని రిటైర్డ్ కార్మికులకు సైతం త్వరలోనే ఆర్డర్ కాపీలు అందజేయడం జరుగుతుందని ఆందోళన చెందవద్దని తెలిపారు.

అంబికా దర్బార్ బత్తి సంస్థ తన సంస్థలో 15 సంవత్సరాల పని చేసిన కార్మికులకు ఇల్లు నిర్మించి, అందిస్తుందని అదేవిధంగా సింగరేణిలో 30,35 సంవత్సరాలు పని చేసిన రిటైర్డ్ కార్మికులకు సైతం సింగరేణి యాజమాన్యం సొంతింటిని కలను సాకారం చేయాలని కోరారు. ఏరియాలోని కేకే డిస్పెన్సరీలో రిటైర్డ్ కార్మికుల సౌకర్యార్థం ఫిజియోథెరపీ సేవలు, 2డికో సేవలు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. సింగరేణిలో గోల్డెన్ సెకండ్ పథకం ద్వారా పదవి విరమణ పొందిన కార్మికులకు మానవత దృక్పథ్యంతో వైద్య సేవలు, మందులు అందించాలన్నారు. అదేవిధంగా ఇటీవల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వారికి ఎల్పి ఎనిమిది లక్షలు 10 లక్షలు పెంచడం జరిగిందని వెంటనే దానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. సింగరేణి మెడికల్ బోర్డులో అవినీతి జరిగిందని గత కొద్ది రోజులుగా మెడికల్ బోర్డు నిర్వహించకపోవడం తగదని, వెంటనే యధావిధిగా మెడికల్ బోర్డు నిర్వహించాలని డిమాండ్ చేశారు.