16-07-2025 02:46:12 PM
వలిగొండ,(విజయక్రాంతి): ధర్మారెడ్డిపల్లి కాలువ పనులను త్వరగా పూర్తి చేయాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి(Bhuvanagiri MLA Kumbam Anil Kumar Reddy) అన్నారు. బుధవారం వలిగొండ మండలంలోని గోకారం చెరువు నుండి ప్రారంభమయ్యే ధర్మారెడ్డి కాల్వపై అధికారులతో రివ్యూ సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం కాలువ మరమ్మతుల పనులను కాలువ వెంట మోటార్ సైకిల్ పై తిరుగుతూ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే భవనగిరి నియోజకవర్గంలోని ధర్మారెడ్డిపల్లి, పిల్లాయిపల్లి, బునాదిగాని కాలువల మరమ్మతుల గురించి పదేపదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ఇరిగేషన్ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, మందుల సామ్యూల్ తో కలిసి పరిస్థితి తెలియజేయడం జరిగిందని అన్నారు.
నాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞంలో భాగంగా కాలువలను నిర్మించడం జరిగిందని అన్నారు. అనంతరం పది ఏండ్లు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న కాలువలను పట్టించుకో లేదని తాను పాదయాత్ర చేస్తే నిధులు ఇస్తామని ఇవ్వలేదని అన్నారు. గోకారం చెరువు నుండి వెళ్లే ధర్మ రెడ్డిపల్లి కాలువ పనులను పరిశీలించడం జరిగిందని కాలువ వెడల్పు కోసం భూసేకరణ అవసరమని రైతుల సహకారం ఉండాలని కోరారు. గత ప్రభుత్వం కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయతో కమిషన్లు దండుకున్నారని అన్నారు. ధర్మారెడ్డి పల్లి కాలువ ఇంతకుముందు 1.50 మీటర్ల వెడల్పు, 30 క్యూసెక్కుల నీరు ప్రవహించే విధంగా ఉండేదని ప్రస్తుతం కాలువ వెడల్పును ఆరు మీటర్లకు పెంచి 350 క్యూసెక్కుల నీటిని ప్రవహించే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. దీంతో వలిగొండ, రామన్నపేట, చిట్యాల, నార్కెట్ పల్లి వరకు వందలాది చెరువుల నింపుతూ వేలాది ఎకరాలకు సాగునీటిని అందిస్తుందని అన్నారు. భువనగిరి నియోజకవర్గంలోని కాలువల కోసం ప్రభుత్వం 500 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని దీంతో 70 వేల ఎకరాలకు సాగునీటి అందించే అవకాశం ఉందని అందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఇరిగేషన్ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఈ మనోహర్, ఆర్డీవో శేఖర్ రెడ్డి, డిప్యూటీ డిఈ కృష్ణారెడ్డి, ఏఈఈలు బలరాం, తరుణ్ తేజ, విద్యుత్ శాఖ డిఈ మల్లికార్జున, ఏఈ నరసింహ, తహసిల్దార్ దశరథ. ఎంపీఓ కేదారేశ్వర్, ఎమ్.ఆర్.ఐ కరుణాకర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి అపర్ణ తదితరులు పాల్గొన్నారు.