28-07-2025 06:02:37 PM
కొత్తపల్లి (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా(Karimnagar District) కొత్తపల్లి హవేలి రెవెన్యూ పరిధిలోని 272 సర్వే నెంబర్ లో ఉన్న 24.24 ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైందని, ఇందులో చట్ట విరుద్ధంగా చేసిన అన్ని రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి పంజాల శ్రీనివాస్(CPI District General Secretary Panjala Srinivas) డిమాండ్ చేశారు. కొత్తపల్లిలోని మెడికల్ కాలేజీ ఎదురుగా అత్యంత విలువైన ఈ భూములను ప్రభుత్వం కాపాడాలన్నారు. ఈ సర్వే నెంబర్ ను పూర్తిగా ప్రొహిబిటెడ్ లిస్టులో చేర్చినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా గత పాతికేళ్లుగా సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్ చేస్తూ వస్తున్నారని, ప్రభుత్వ, అసైన్డ్ భూములను రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్ట్రార్లందరిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
కరీంనగర్– జగిత్యాల జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఈ భూమి విలువ రూ.200 కోట్లకుపైగా ఉంటుందని, ఈ భూమిని ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లావ్యాప్తంగా ఇలా ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ జాబితాలోని సర్వే నంబర్లలోని భూముల రిజిస్ట్రేషన్లపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సర్వే నంబర్ లో కేవలం 9 డాక్యుమెంట్లను మాత్రమే రద్దు చేయడం సరికాదని, ఆ సర్వే నంబర్ లో అయిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లన్నింటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇందులో కొందరు పేరు, పలుకుబడి ఉన్నవాళ్లను ఆఫీసర్లు కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సబ్ రిజిస్ట్రార్ ను సస్పెండ్ చేసి చేతులు దులిపేసుకుంటే సరిపోదని, సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన అందరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.