28-07-2025 05:57:29 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కురవి మండలం ఖాసిం తండా ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న పేద విద్యార్థులకు ఎలాంటి లోటు లేకుండా దాతలు సకల సౌకర్యాలు కల్పించారు. ప్రైవేటు పాఠశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులకు దీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలను దాతలు సమకూర్చారు. పాఠశాల హెడ్మాస్టర్ పోలోజు మంజుల, రమేష్ సహకారంతో 9 వేల రూపాయల విలువైన ఏకరూప దుస్తులు, స్కూల్ బ్యాగులు అందజేశారు.
అలాగే రమేష్ రాథోడ్ అనే దాత ఐదువేల రూపాయల ఖర్చుతో పాఠశాలకు సౌండ్ సిస్టం ఏర్పాటు చేశారు. 30 మంది విద్యార్థులకు మరో దాత హేమ నాయక్ స్టీల్ ప్లేట్లు అందజేశారు. అలాగే వినోద్ కుమార్ అనే దాత విద్యార్థులకు నోటు పుస్తకాలను అందజేశారు. పాఠశాలలో సోమవారం జరిగిన కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి డాక్టర్ ఏ. రవీందర్ రెడ్డి, మండల విద్యాధికారి బాలాజీ చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. ఈ విద్యా సంవత్సరం పాఠశాల విద్యార్థుల లేమితో మూతపడే దశలో ఉండగా, హెడ్మాస్టర్ మంజుల ఇంటింటికి తిరిగి పాఠశాలలో విద్యార్థులు చేర్చే విధంగా కృషి చేశారు.