12-11-2025 08:00:41 PM
ఇసుక ర్యాంపుల్లో రేజింగ్
కాంట్రాక్టర్ ఆగడాలు
వెంకటాపురం(నూగూరు),(విజయక్రాంతి): అక్రమ గ్రావెల్ తవ్వకాలకు వెంకటాపురం మండలం అడ్డాగా మారింది. గత నాలుగు రోజులుగా మండల పరిధిలోని అంకన్నగూడెం సమీపంలో గుడిగుట్టల వద్ద అడ్డు అదుపు లేకుండా అక్రమ గ్రావెల్ తరలింపు సాగుతోంది. ఇటీవల అబ్బాయి గూడెం ఇసుక ర్యాంపు ప్రభుత్వం నుండి అనుమతులు రావడంతో ఆ క్వారీని తీసుకున్న రీజింగ్ కాంట్రాక్టర్ పగలు రాత్రి తేడా లేకుండా విచ్చలవిడిగా గ్రావెల్ను ఇసుక ర్యాంపుకు రహదారి నిమిత్తం తరలిస్తున్నాడు. ఈ వ్యవహారం అంతా రెవిన్యూ అధికారుల కనుసన్నలోనే జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జెసిబిల సహాయంతో భారీ ఎత్తున గ్రావెల్లో తోడి ట్రాక్టర్ల ద్వారా ఇసుక ర్యాంపుకు గ్రావెల్ ను తరలిస్తున్నారు. అడ్డు అదుపు లేకుండా జరుగుతున్న ఈ వ్యవహారం ఇదేచ్ఛగా సాగుతున్న పట్టించుకునే అధికారులే కరువయ్యారనే విమర్శలు వస్తున్నాయి. అధికార పార్టీ అండతో ఎక్కడ గ్రామీణ తరలింపు జరుగుతున్నాయని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ప్రభుత్వ నిబంధనలు ఏమాత్రం పాటించకుండా నామమాత్రపు అనుమతులతో విచ్చలవిడిగా సాగుతున్న గ్రావెల్ దందా వ్యవహారంపై ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంత వాసులు కోరుతున్నారు.