పోలీసుల మద్దతుతోనే వీడియోలు వైరల్‌l

08-05-2024 12:07:09 AM

ప్రజ్వల్ కేసులో మాజీ సీఎం కుమారస్వామి ఆరోపణలు

ఉద్దేశపూర్వకంగానే  చేసినట్లు అనుమానం వ్యక్తం 

బెంగళూరు, మే 7: ప్రజ్వల్ లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసుల సాయంతోనే ప్రజ్వల్‌కు సంబంధించిన అశ్లీల వీడియోలు బయటికి వచ్చా యని ఆరోపించారు. మంగళవారం మీడి యా సమావేశంలో మాట్లాడిన కుమారస్వామి.. సమాజంలో జరగకూడని ఓ విషయం గురించి ఈరోజు మాట్లాడేందుకు వచ్చాను. ఏప్రిల్ 21న ఓ పెన్‌డ్రైవ్‌లోని వీడియోలు రాష్ట్రవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. ఇది పోలీస్ అధికారుల సహకారంతోనే జరిగింది. ఉద్దేశపూర్వకంగానే బెంగళూరు రూరల్, మాండ్య, హసన్‌లో విస్తృతంగా ప్రచారమయ్యాయి. 21న ఓ వ్యక్తి ప్రజ్వల్ వీడియోలు చూడండంటూ ట్వీట్ చేశారు. ఈ విషయంలో నేను ఎవరికీ మద్దతు ఇవ్వడంలేదు. చట్టం తన పని తాను చేస్తుంది. తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే. వీడియోలు వ్యాప్తి చేశారనే ఆరోపణలతో నలుగురిపై కేసు నమోదు చేశారు. 15 రోజులవుతున్నా ఇప్పటికీ వారిపై చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశిస్తే పారదర్శకంగా దర్యాప్తు జరుగుతుందని భావించా. కానీ, సిట్ అంటే సిద్ధరామయ్య, శివకుమార్ ఇన్వెస్టిగేషన్ టీమ్ తరహాలో పనిచేస్తుందని అనుకోలేదు అని ఆరోపించారు. 

విచారణపైనా అనుమానాలు

అంతేకాకుండా సిట్ విచారణపై కుమారస్వామి పలు అనుమానాలను వ్యక్తం చేశారు. హెచ్‌డీ రేవణ్ణపై ఎవరూ ప్రత్యక్షంగా ఫిర్యాదు చేయలేదని తెలిపారు. ఓ మహిళ కిడ్నాప్ అయినట్లు కేసు నమోదు చేశారు. రేవణ్ణ బెయిల్ కోసం దరఖాస్తు చేస్తే సదరు మహిళ బతికే ఉందో లేదో తెలియదని సిట్ చెప్పింది. కానీ తర్వాత ఓ ఫామ్‌హౌస్ నుంచి ఆమెను రక్షించినట్లు చెప్పారు. అయితే ఇప్పటివరకు ఆమెను జడ్జి ముందు ఎందుకు ప్రవేశపెట్టలేదు. ఏప్రిల్ 30న డ్రైవర్ కార్తీక్ ఈ కేసు గురించి మీడియాకు సమాచారం ఇచ్చాడు. అయితే, అప్పటినుంచి తనెందుకు ప్రజల ముందుకు రాలేదు? ఎందుకు అతన్ని అరెస్ట్ చేయలేదు? అతన్ని వెతికేందుకు సిట్ ఎందుకు ప్రయత్నాలు చేయట్లేదు? ఈ విచారణ కేవలం హెచ్‌డీ రేవణ్ణ, అతని కుమారుడు ప్రజ్వల్ లక్ష్యంగానే జరుగుతోందా? అని నిలదీశారు.