కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు

08-05-2024 12:09:29 AM

మే 20 వరకు పొడిగించిన ఢిల్లీ కోర్టు

బెయిలిస్తే సీఎంగా సంతకాలు చేయొద్దు

విచారణ సందర్భంగా జడ్జి వ్యాఖ్యలు 

న్యూఢిల్లీ, మే 7: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరోసారి చుక్కెదురైంది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఆయనకు జ్యుడీషియల్  కస్టడీని మే 20 వరకు పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీబీఐ, ఈడీ ప్రత్యేక కోర్టు జడ్జి కావేరీ బవేజా ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన జ్యుడీషియల్ కస్టడీ ముగిసి పోవడంతో మంగళవారం విచారణకు అరవింద్ కేజ్రీవాల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజర య్యారు. ఇదే కేసులో మరో నిందితుడు చన్‌ప్రీత్ సింగ్ జ్యుడీషియల్ కస్టడీ కూడా కోర్టు పొడిగించింది. కాగా, సుప్రీం కోర్టులో కూడా కేజ్రీవాల్‌కు ఊరట లభించలేదు. తన అరెస్టును చాలెంజ్ చేస్తూ సుప్రీం కోర్టులో కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిగింది. న్యాయ మూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఓ పార్టీ అధినేతగా ఎన్నికల ప్రచారం నిర్వహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. అయితే మధ్యంతర  ఉత్తర్వులు కనుక జారీ చేస్తే సీఎం హోదాలో ఎలాంటి సంతకాలు చేయకూడదని పేర్కొంది. అయితే బెయిల్‌పై ఎలాంటి ఆదేశాలు ఇవ్వకుండా తీర్పును రిజర్వ్ చేసింది. 

సీఎం అయితే వేరుగా చూడొద్దు...

అరవింద్ కేజ్రీవాల్ ప్రజలు ఎన్నుకున్న సీఎం అని, తరచూ నేరాలు చేసే వ్యక్తి కాదని సుప్రీం కోర్టు ధర్మాసనం పేర్కొంది. లోక్‌సభ ఎన్నికలు ఐదేళ్లకోసారి వస్తాయని, పార్టీ అధినేతగా ఆయన ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. అయితే దీనిపై ఈడీ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘సీఎం అయినంత మాత్రాన  ఈ కేసును ప్రత్యేకంగా పరిగణించకూడదు. కేసుల్లో రాజకీయ నాయకులకు మినహాయింపు ఉండకూడదు. ఇప్పుడు బెయిల్ మంజూరు చేస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. ఈ కేసులో కేజ్రీవాల్ విచా రణకు సహకరించలేదు. 9 సార్లు సమన్లు పంపినా పట్టించుకోలేదు. అందుకే అరెస్టు చేయాల్సి వచ్చింది’ అని ఈడీ పేర్కొంది.