22-08-2025 02:21:56 AM
గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.వినయ్ కుమార్
ముషీరాబాద్, ఆగస్టు 21(విజయక్రాంతి): గత సంవత్సరం 2024 జనవరిలో జిహెచ్‌ఎంసి రెవెన్యూ అధికారులు స్వామి వివేకానంద నగర్ బస్తి వాసుల ఇళ్లను కూల్చేశారని, ఇప్పటి వరకు నిరాశ్రయులైన పేదలకు ఇళ్లు కేటాయించలేదని, వెంటనే వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాంచాలని కోరుతూ గురువారం హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దాసరి హరి చేందన ను ఆమె కార్యాలయంలో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.
గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ మాట్లాడుతూ ఎలాంటి ప్రత్యామ్నాయం చూపకుండా పేదల ఇళ్లను కూల్చి 19 నెలలు గడిచిందని, ఇప్పటి వరకు ఇళ్లు కోల్పోయి దీన స్థితిలో ఉన్న19 దళిత కుటుంబాలకు ప్రభుత్వం ఇళ్లను కేటాయించాలని కోరారు. ఈ విషయంపై కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, ఎం.పి రాజ్యసభ డాక్టర్ కె. లక్ష్మణ్ హైదరాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కు ఇళ్ల మంజూరుకు లిఖిత పూర్వకంగా సూచించారని కార్పొరేటర్ అన్నారు.
ఇళ్లు కోల్పోయిన పేదల కష్టాలను, ఇళ్ల కేటాయింపుపై జరుగుతున్న అలస్యంపై, ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకొని నిరాశ్రయులైన నిరుపేద కుటుంబాలకు వెంటనే నీడను కల్పించి ఆదుకో వాలని కార్పొరేటర్ కలెక్టర్ ను కోరారు. సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్ మంజూరు అయిన ఇళ్లను అతి త్వరలో కేటాయింపు ప్రక్రియ పూర్తి చేసి పెదలను ఆదుకుంటామని హామీ ఇచ్చినట్లు కార్పొరేటర్ వివరించారు.
ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, బస్తి వాసులు ఎం.బీ.కృష్ణ, జ్ఞానేశ్వర్, ఆనంద్ రావు తదితరులు పాల్గొన్నారు.