14-12-2024 01:33:54 AM
హైదరాబాద్, డిసెంబర్ 13 (విజయక్రాంతి): పుష్ప-2 సినిమా రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించిన ఘటనలో అరెస్టయిన హీరో అల్లు అర్జన్‌కు శుక్రవారం హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
రూ.50 వేల వ్యక్తిగత బాండ్లు చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌కు సమర్పించాలని షరతు విధించింది. అర్నబ్ గోస్వామి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర, భజన్‌లాల్ కేసుల్లో తీర్పును ఉదహరిస్తూ ముందస్తు బెయిల్ మంజూరు చేస్తున్నట్టు స్పష్టం చేశారు.
తొక్కిసలాటలో మరణించిన మహిళ భర్త ఫిర్యాదు మేరకు చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసులో అరెస్టు చేయకుండా బెయిల్ మంజూరు చేయాలంటూ అల్లు అర్జున్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై జస్టిస్ జువ్వాడి శ్రీదేవి ఎదుట సుదీర్ఘ వాదనలు జరిగాయి.
అనంతరం అల్లు అర్జున్‌తోపాటు సంధ్య థియేటర్ యజమానులు ఇద్దరికి మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. ఇంకా అరెస్ట్ కాని వారిలో సంధ్య థియేటర్ యజమానులు నలుగురిపై కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులకు ఉత్తర్వులు జారీ చేశారు.
అల్లు అర్జున్ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, లంచ్ మోషన్ పిటిషన్‌ను అనుమతించాలని కోరారు. సామాన్యులకు ఒకలా, అల్లు అర్జున్ వంటి సెలబ్రిటీకి మరోలా చేయవద్దని పోలీసుల తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ జితేందర్రావు వీలమల్ల ప్రతివాదన చేశారు.
హైకోర్టు కల్పించుకుని, సెలబ్రిటీ అని ఇప్పుడు లంచ్‌మోషన్ పిటిషన్ అనుమతిస్తే రేపు ఇతరులు కూడా కోరతారు కదా? అని ప్రశ్నించింది. నిరంజన్‌రెడ్డి కల్పించుకుని, అల్లు అర్జున్ పిటిషన్‌ను సామాన్యుడిదిగానే పరిగణించాలని కోరారు. పిటిషనర్‌ను ఇంకా అరెస్టు చేయలేదని, అందుకే హైకోర్టుకు వచ్చామన్నారు.
దీనిపై జితేందర్‌రావు అభ్యంతరం చెప్పడంతో అల్లు అర్జున్‌ను అరెస్టు చేయబోమని హామీ ఇవ్వాలని నిరంజన్‌రెడ్డి కోరారు. ఉన్నతాధికారులను సంప్రదించాకే హామీపై స్పష్టత ఇవ్వగలమని, ఫైల్ పీపీ వద్ద ఉన్నందున విచారణను వాయిదా వేయాలని జితేందర్‌రావు కోరడంతో మధ్యాహ్నానికి వాయిదా పడింది.
పిటిషన్‌కు విచారణ అర్హత లేదు: పీపీ
భోజన విరామం తర్వాత 2.30 గంటలకు ప్రారంభమైన విచారణ సమయంలో పోలీసుల తరఫున పీపీ పల్లె నాగేశ్వరరావు వాదిస్తూ, 1.30 గంటలకు నిందితుడు అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్టు చేశారని, నాంపల్లి కోర్టు రిమాండ్ ఉత్తర్వులను జారీ చేసిందని చెప్పారు. కాబట్టి పిటిషన్‌కు విచారణ అర్హత లేదని చెప్పారు. పిటిషనర్ ప్రత్యామ్నాయాలు చూసుకోవాలని సలహా ఇచ్చారు.
సాధారణంగా ఉదయమే లంచ్ మోషన్ పిటిషన్ వేస్తారని, దీనిని అనుమతించరాదని అన్నారు. పిటిషనర్ సెలబ్రిటీ కాబట్టి ప్రత్యేకంగా చూడాల్సిన అవసరంలేదని చెప్పారు. నిరంజన్‌రెడ్డి కల్పించుకుని, సెలబ్రిటీ అని చెప్పి వ్యక్తిగా ఉండే హక్కులు హరిస్తుంటే కోర్టులు జోక్యం చేసుకోవాలన్నారు.
జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామి, భజనలాల్ కేసుల్లో అరెస్టు తర్వాత కూడా కోర్టులు జోక్యం చేసుకోవచ్చని హైకోర్టు, సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేశాయన్నారు. అల్లు అర్జున్ సంధ్య థియేటర్‌కు వెళ్లడం వల్లే తొక్కిసలాట జరిగిందని తీవ్ర అభియోగాలతో కేసు నమోదు చేయడం దారుణమన్నారు.
పుష్కరాల్లో 30 మంది చనిపోతే..
పుష్కరాలకు సీఎం హాజరైతే సుమారు 30 మంది చనిపోయారని, అప్పుడు కూడా ఇదే తరహా కేసు నమోదు చేస్తారా? అని ప్రశ్నించారు. దురదృష్టవశాత్తు తొక్కిసలాట జరిగితే దానికి అల్లు అర్జున్‌ను బాధ్యుడిని చేయడం అన్యాయమని నిరంజన్‌రెడ్డి అన్నారు. ఇప్పటికే అరెస్ట్ చేశారని, మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. ఇలాంటి కేసుల్లో సుప్రీంకోర్టు, ఇదే హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చాయన్నారు.
లంచ్‌మోషన్ పిటిషన్‌పై రిజిస్ట్రీ అభ్యంతరం చెప్పడంతో విచారణ సాయంత్రం నాలుగు గంటలకు వాయిదా పడింది. సంధ్య థియేటర్ భాగస్వాములు దాఖలు చేసిన పిటిషన్ తరఫున న్యాయవాది కరంచెంప కొమిరెడ్డి వాదిస్తూ, పుష్ప బెనిఫిట్ షో ప్రదర్శనకు ప్రభుత్వం అనుమతిచ్చిందన్నారు. దీనిపై పోలీసులకు ముందుగానే సమాచారం కూడా ఇచ్చామన్నారు.
పోలీసులు అన్యాయంగా కేసు నమోదు చేశారని, ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేశారని, మిగిలిన వాళ్లను కూడా అరెస్టు చేసే అవకాశం ఉన్నందున మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. అల్లు అర్జున్ తరఫున నిరంజన్‌రెడ్డి వాదిస్తూ, పిటిషనర్ ఒక్కరోజు జైల్లో ఉన్నా హక్కులకు భంగం కలిగించినట్లేనని అన్నారు.
ఏ ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసి నిర్బంధించడం వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించినట్లేనన్నారు. సినిమా విడుదల సందర్భంగా హీరోలు థియేటర్లకు వెళ్లడం పరిపాటేనన్నారు.
షారూక్ ఖాన్ రైలు ప్రయాణ సమయంలో..
షారూఖ్ ఖాన్ ఒకసారి రైలులో ప్రయాణిస్తుండగా రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగిందంటూ పోలీసులు పెట్టిన కేసును కోర్టు కొట్టేసిందని గుర్తు చేశారు. అల్లు అర్జున్ సంధ్య థియేటర్ బాల్కనీలో ఉండగా అదే థియేటర్లో కింద తొక్కిసలాట జరిగిందన్నారు. పోలీసులు తమ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగానే కేసు నమోదు చేశారన్నారు.
పిటిషనర్‌ను రిమాండ్‌కు పంపినా క్వాష్ పిటిషన్‌లో కోర్టులు మధ్యంతర బెయిల్ మంజూరు చేయవచ్చని చెప్పారు. అర్నబ్ గోస్వామి వర్సెస్ మహారాష్ట్ర కేసులో సుప్రీం కోర్టు, బండి సంజయ్ అరెస్టు కేసులో ఇదే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులే నిదర్శమని చెప్పారు. పిటిషనర్ రూ.20 లక్షలు ఫిర్యాదుదారుడికి ఆర్థికసాయం అందించేందుకు ముందుకొచ్చారన్నారు. అల్లు అర్జున్‌ను సామాన్యుడిగా పరిగణించి మధ్యంతర బెయిల్ జారీ చేయాలని కోరారు.
రావొద్దని పోలీసులు చెప్పారు: పీపీ
హీరో అల్లు అర్జున్ సంధ్య థియేటర్‌కు రావడం వల్లే తొక్కిసలాట జరిగిందని పీపీ పల్లె నాగేశ్వరరావు తెలిపారు. పెద్దఎత్తున జనం గుమిగూడే అవకాశం ఉన్నందున రావొద్దని ఎస్‌హెచ్‌వో హెచ్చరిందని, అయినా ఆయన వచ్చారని చెప్పారు. తొక్కిసలాటలో ఒక మహిళ మరణించగా, ఆమె కమారుడు, కుమార్తె గాయాలతో చికిత్స పొందుతున్నారని చెప్పారు.
హీరో అయినంతమాత్రాన నిందితుడికి ప్రత్యేక హక్కులు ఉండవన్నారు. ప్రత్యేకంగా పరిగణించి లంచ్ మోషన్‌ను విచారణ చేపట్టక్కర్లేదన్నారు. థియేటర్ యాజమాన్యం, హీరో సమాచారం ఇచ్చినంత మాత్రాన పోలీసులు అనుమతిచ్చినట్టు కాదన్నారు.
అందువల్ల తొక్కిసలాటకు వాళ్లే కారణమన్నారు. ఇప్పటికే నిందితుడు అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారని.. రిమాండ్ రిపోర్టు లేకుండా బెయిల్ ఉత్తర్వులు జారీ చేయడానికి వీల్లేదన్నారు.
అయితే, ఆధారాలు ఏవి: హైకోర్టు
సంధ్య థియేటర్‌కు వస్తున్నట్టు పిటిషనర్ అల్లు అర్జున్ పోలీసులకు సమా చారం ఇచ్చినట్టు ఆధారాలు చూపుతున్నారని, పోలీసులు రావద్దని చెప్పినట్టు గా ఆధారాలు చూపడం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. తొక్కిసలాటలో మహి ళ మరణిస్తే అందుకు సినిమా చూసేందుకు వచ్చిన అల్లు అర్జున్ ఎలా బాధ్యు డు అవుతాడని ప్రశ్నించింది.
క్వాష్ పిటిషన్‌లో మధ్యంతర బెయిలు మంజూరు చేయొచ్చని పిటిషనర్ తరఫు లాయర్ ఉదహరిస్తున్న తీర్పులను పరిశీలించాలని పీపీకి చెప్పింది. మొత్తంగా ప్రాథమి క ఆధారాలను పరిశీలిస్తే పిటిషనర్‌కు వ్యతిరేకంగా ప్రాసిక్యూషన్ కేసును ని రూపించడం లేదని అభిప్రాయపడింది. అందుకే పిటిషనర్‌తోపాటు థియేటర్ యజమానులకు తాత్కాలికంగా ఉపశమనం కల్పిస్తున్నట్టు ప్రకటించింది.
నాలుగు వారాలపాటు మధ్యంతర బెయి ల్ మంజూరు చేస్టున్నట్టు వెల్లడించింది. మధ్యంతర ఉత్తర్వులు పోలీసుల దర్యాప్తునకు అవరోధం కాదని స్పష్టం చేసింది. పోలీసుల దర్యాప్తునకు అల్లు అర్జున్, సంధ్య థియేటర్ యజమానులు ఇతర పిటిషనర్లు సహకరించాలని ఆదేశించింది.
దర్యాప్తులో జోక్యం చేసుకోరాద ని మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది. మధ్యంతర బెయిల్ పొందేందుకు జైలు సూపరింటెండెంట్‌కు రూ.50 వేల విలువైన వ్యక్తిగత పూచీకత్తులను సమర్పించా లని పిటిషనర్లను ఆదేశిస్తూ విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.