14-09-2025 05:28:33 PM
బీజేపీ పట్టణ అధ్యక్షుడు రాపెల్లి శ్రీధర్
వేములవాడ టౌన్,(విజయక్రాంతి): విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆటలాడుతోందని, చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని వేములవాడ పట్టణ బీజేపీ అధ్యక్షులు రాపెల్లి శ్రీధర్ డిమాండ్ చేశారు. ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తవుతున్నా ఇప్పటికీ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడం విద్యార్థులకు తీవ్ర నష్టం కలిగిస్తోందని అన్నారు.
అగ్రహారం డిగ్రీ కాలేజీ విద్యార్థులు రోడ్డుపై ధర్నాలు చేయాల్సిన స్థితి రావడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆయన విమర్శించారు. 600-800 మంది విద్యార్థులకు మాత్రమే వసతులు కలిగిన కాలేజీలో జేఎన్టీయూ విద్యార్థులను రెండు సంవత్సరాల ఒప్పందం పేరుతో మూడు సంవత్సరాలు నెట్టేస్తూ, వారికి కేటాయించిన భూమిలో ఇప్పటికీ భవన నిర్మాణం చేపట్టకపోవడం సిగ్గుచేటు అన్నారు.రాష్ట్ర ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఇప్పటికీ విద్యార్థుల సమస్యపై స్పందించకపోవడం శోచనీయమని వ్యాఖ్యానించారు.
విద్యార్థుల సమస్యలను ముఖ్యమంత్రికి తెలియజేసి, వెంటనే జేఎన్టీయూ విద్యార్థులకు భవనం నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా బిజెవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రేగుల రాజకుమార్ మాట్లాడుతూ… విద్య, వైద్యంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి శ్రద్ధ ఉంటే ఇప్పటికీ విద్యాశాఖ మంత్రిని నియమించి విద్యార్థుల భవిష్యత్తు దిశగా నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాల్సిందని సూచించారు.