14-09-2025 05:19:09 PM
ఏరియా సింగరేణి జిఎం రాధాకృష్ణ
మందమర్రి,(విజయక్రాంతి): సింగరేణి కార్మిక క్రీడాకారులు ఏరియా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి కో స్థాయి పోటీలకు ఎంపికై పతకాలు సాధించి సింగరేణి కీర్తి పతాకాన్ని కోల్ ఇండియాలో ఎగురవేయాలని ఏరియా సింగరేణి జిఎం ఎన్ రాధాకృష్ణ కోరారు. ఏరియా లోని ఎల్లందు క్లబ్ లో ఆదివారం వర్క్ పీపుల్ స్పోర్ట్స్& గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 61వ వార్షిక క్రీడోత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై పోటీలను ప్రారంబించి మాట్లాడారు.
క్రీడలు మానసి కోల్లాసానికి, శరీర దృడత్వానికి తోడ్పడతాయని, ఉద్యోగి ఆరోగ్యంగా ఉన్నప్పుడే సంస్థ అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు. సింగరేణి యాజమాన్యం కార్మిక క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుందని క్రీడాకారులు క్రీడల్లో నైపుణ్యం పెంపొందించు కోవాలన్నారు. సీనియర్ క్రీడాకారులు సంస్థలో పని చేస్తున్న యువ ఉద్యోగులను క్రీడల వైపు ప్రోత్సహించాలన్నారు.
సింగరేణి ఉద్యోగులకు ప్రతి సం. క్రీడలను నిర్వహించడం జరుగుతుందని, ఈ పోటీలలో పాల్గొన్న క్రీడాకారులు, కళాకారులు కోల్ ఇండియా స్థాయి పోటీలలో రాణించి ప్రతి సంవత్సరం అనేక బహుమతులు సాధిస్తున్నారన్నారు. ఏరియా క్రీడాకారులు కోల్ ఇండియా పోటీలకు ఎంపికై పతకాలు సాధించి సింగరేణికి , ఏరియాకు పేరు ప్రఖ్యాతలు తీసుకు రావాలని అయన కోరారు. అనంతరం టేబుల్ టెన్నిస్, షటిల్ బాడ్మింటన్, బాడీ బిల్డింగ్, వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్, పోటీలను ప్రారంబించారు.