23-04-2025 12:00:00 AM
సహాయ సాధ్యం రాజత్వం
చక్రమేకం న వర్తతే
కుర్వీత సచివాం స్తస్మాత్
తేషాం చ శ్రుణుయాన్మతమ్॥
కౌటిలీయం:- (1.7)“రాజత్వం అనేది సహాయులను దగ్గర ఉంచుకొని సాధించవలసింది. ఒకే చక్రం ఉన్న బండి నడవదు. కనుక మంత్రులను, అమాత్యులను ఏర్పాటు చేసుకోవాలి. వాళ్ళ అభిప్రాయాలను వింటూ వుండా లి” అంటారు చాణక్య. ప్రధానమంత్రిని మంత్రిగానూ, ఇతర మంత్రులను అమాత్యులుగానూ ఆ కాలంలో వ్యవహరించే వారు. దీనినే సంస్థలో ముఖ్య కార్యనిర్వహణాధికారిని మంత్రిగానూ, వివిధ విభాగాధిపతులను అమాత్యులుగానూ వ్యవహరించుకోవచ్చు.
ప్రభుత్వం అనేది అన్ని కార్యాలను ఏక కాలంలో నిర్వహించే సామర్థ్యం. ఒకే చక్రం ఉన్న బండి ఎలాగైతే నడవదో అలాగే ప్ర పంచంలో ఏ ఒక్కరూ అన్ని పనులనూ తా మే చేసుకోలేరు. అందువల్ల వివిధ విభాగాలకు సమర్థులైన వ్యక్తులను నియమిం చి, వారికి సహాయకులుగా వివిధ బృందాలను ఏర్పరచి ఆశించిన ఫలితాలను ఆవి ష్కరించాలి. రాజ్య వ్యవస్థలోనైనా, వ్యాపా ర రంగంలోనైనా ఇదే అనుసరణీయం.
వివిధ విభాగాధిపతుల సలహాలను ఆహ్వానిస్తూ, ఆచరణీయమైన సూచనలను అమ లు పరచడం వల్ల ఉత్తమ ఫలితాలను సా ధించడం నాయకునికి సాధ్యపడుతుంది. బృంద సభ్యులలో ఏ ఒక్కరూ పరిత్యజించ వలసిన వారుకారు. అందరూ కలిస్తేనే బృందమవుతుంది.
ఎవరెంత సమర్థులైనా ఏ ఒకరిపైనో, ఆధారపడడం ఆత్మహత్యా సదృశంగానే భావిం చాలి. బృందంలోని సభ్యులలో ఒక రి బలహీనతలకు ప్రత్యామ్నాయంగా మ రొకరి బలాలు పరిపూర్ణం చేస్తాయి. అలాగే వ్యక్తిగత బలమే బృందం బలం గా విజయం వైపు నడిపిస్తుంది.
వ్యక్తులమధ్య అవగాహనతో కూడిన భేదాభిప్రాయాలు చర్చలుగా కొత్త పరిష్కారాలకు మార్గం చూపుతాయి. ఒకరితో ఒకరు ఆలోచనల ను పంచుకోవడం వల్ల ఒక ఆలోచన ఇరువురి వద్ద రెండు ఆలోచనలుగా పరిణతి చెందుతుంది. లోతైన, విస్తృతమైన ఆలోచనా పరిణతి ఎలాంటి సమస్యలకైనా ఒత్తి డి లేని విధానంలో పరిష్కారాన్ని సూచిం చ గలుగుతుంది.
ముఖ్య నిర్వహణాధికారి.. ప్రతి విభాగానికి సంబంధించిన ఎవరెవరి బాధ్యతల ను, లక్ష్యాలను వారే ఏర్పరుచుకోవడంలో నూ, వారిమధ్య సమన్వయాన్ని సాధించడంలోనూ ప్రధాన పాత్ర పోషిస్తాడు. దాం తో సంస్థ లక్ష్యం, ఆ లక్ష్య సాధనలో ఎవరి పాత్ర వారికి స్పష్టమవుతాయి. కార్య సాధనలో ప్రక్రియ ప్రాధాన్యత, దానిని సాధిం చే మార్గాలు నాయకుడు స్పష్టపరుస్తాడు.
వాటిని సాధించడం వల్ల సంస్థకు కలిగే ప్రయోజనం, వ్యక్తిగతంగా ఎవరెవరికి ఏ ప్రయోజనం కలుగుతుందో స్పష్టంగా వివరిస్తాడు. దానితో ప్రతి ఒక్కరూ బృంద విజయానికై అంకితభావంతో పనిచేస్తారు. నిజానికి అస్పష్టత కార్యాన్ని చంపి వేస్తుందనేది సామెత. బృంద సభ్యులు ప్రతి ఒక్కరూ నిద్రలో అడిగినా సంస్థలో తమ లక్ష్యాలను చెప్పగలగాలి.
ఉన్నత ప్రమాణాలతో పనిచేయాలి!
చాలా వ్యాపార సంస్థలలో ఉత్తమోత్తమమైన సామర్థ్యాన్ని కలిగిన ఉద్యోగులు ఉంటారు. వారి లక్ష్యాలు, తత్సాధనలో వా ళ్ల పాత్రపట్ల స్పష్టమైన అవగాహన వారికుంటుంది. వారి బాధ్యతలను సాధించ డంలో అవసరమైన సమర్థత, విజ్ఞానం, నై పుణ్యాలు ఉంటాయి. అయినా పలుమా ర్లు ఆశించిన ఫలితాలు ఆవిష్కృతం కావు.
కారణం, బృందంలో సమన్వయతను సాధించే సంస్కృతి లోపించడమే. పని సంస్కృతి ఉన్నత ప్రమాణాలతో ఉత్తమ ఫలితాలను ఆవిష్కరిస్తే అది ప్రభావవంతమైన లేదా బాధ్యతాయుతమైందిగా చెప్పు కుంటాం. బృంద సభ్యులలో సమర్థత కలిగినా ఆశించిన ఫలితాలను సాధించలేక పోతే దానిని అభ్యుదయ నిరోధక పని సంస్కృతిగా చెప్పుకుంటాం.
బృందసభ్యుల మధ్య సత్సంబంధాలు, సదవగాహన సంస్థలో చక్కని వాతావరణాన్ని ఏర్పరుస్తూ బలమైన పునాదిగా సం స్థను నిలబెడతాయి. వ్యక్తిగత ఆసక్తి, సంకల్పబలాల కన్నా బృందసభ్యుల మధ్య స దవగాహనతో ఏర్పడిన పరస్పరాధారిత వాతావరణ బంధమే పటిష్టమైంది. అదే బృందసభ్యుల బాధ్యతాయుత ప్రవర్తనకు బీజం వేస్తుంది.
అలా కాక వారిలో నేనే అనే భావన వెలుగు చూస్తూ పరాజయాలకు ఒకరినొకరు నిం దించుకునే వాతావరణం ఏర్పడితే, అక్కడ బృందలక్ష్యంపై కాక వ్యక్తుల ఉన్నతిపై దృష్టి నిలుస్తుంది. తమ ఆధిక్యతను చాటు కునేందుకై సంస్థ ప్రయోజనాలను పణంగా పెడు తూ తోటి సభ్యుల ప్రగతికి అడ్డుపడతారు.
దాంతో సంస్థ అపజయాన్ని ఆహ్వానిస్తుంది. పరిస్థితులెలా ఉన్నా ఉమ్మడిగా ఫలితాన్ని సాధిస్తామనే ఉన్నత సంకల్పం నిర్వీర్యమైపోయి, పరిస్థితులిలా ఉంటేనే ఫలితాలను సాధించగలమనే షరతులతో కూడిన భావనలు వెలుగుచూస్తాయి.
బృందం గెలుపు వ్యక్తిగత గెలుపు
బృందం గెలుపు వ్యక్తిగత గెలుపుగా భావిస్తూ పని చేసే ఉద్యోగులు సంస్థకు ఉ త్తమ వనరులుగా గుర్తింపు పొందుతారు. ఏ పరిమితులు, షరతులూ లేకుండా సం స్థకై తమ సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించి, లక్ష్యసాధనకై నిబద్ధతతో శ్రమించ డం వల్ల అసాధారణ ఫలితాలు ఆవిష్కృతమవుతాయి. సింహం నాయకత్వంలో కుందేళ్ళు కూడా విజయాన్ని సాధిస్తాయి. అదే కుందేలు నాయకత్వంలో సింహాలూ అపజయాన్ని పొందుతాయి.
బాధ్యతాయుతమైన పని సంస్కృతి సంస్థలో నెల కొల్పగలిగితే సాధారణ సామర్థ్యం కలిగిన బృందాలు సైతం గొప్ప ఫలితాలను ఆవిష్కరిస్తాయి. బాధ్యతారహిత పని సంస్కృ తి కలిగిన సంస్థలో అసాధారణమైన సామర్థ్యం కలిగిన బృందాలు కూడా విఫలమవుతాయి.
వ్యక్తి సమర్థత అనేది వారి ప్రభావశీలతకు మూలమైంది. సమర్థత అంటే సం బంధిత రంగంలో అవసరమైన విజ్ఞానం, నైపుణ్యంతోపాటు వాటిని సకాలంలో, సరైన మార్గంలో వినియోగించే నిబద్ధతను కలిగి వుండడం కూడా. అంతేకాక, వాటిని అనుక్షణం ఉన్నతీకరించుకునే ఆసక్తిని కలి గి వుండడమూ. సముద్రంలో మంచుపర్వతం 15 శాతం నుండి 20 శాతం వరకే కనిపిస్తుంది.
మిగిలిన 80 నుంచి 85 కనిపించదు. కనిపించేదే వ్యక్తి విజ్ఞానం, నైపు ణ్యాలుగా చెప్పుకుంటాం. కనిపించని భా గం వ్యక్తి ప్రవర్తన, శీలం, నైతిక విలువలు, సమర్థత, దక్షతలుగా చెప్పుకోవచ్చు. పైకి కనిపించే జ్ఞాన నైపుణ్యాలను గుర్తించడం సులువే కాని కనిపించని వ్యక్తి వైఖరిని అంచనా వేయడం కష్టసాధ్యం.
వ్యక్తి సమర్థత బృందసమర్థతగా రూపాంతరం చెందితే సమగ్రత, నాణ్యతలతో అద్భుత ఉత్పత్తులు సాధ్యపడతాయి. అందుకే, బృంద సభ్యుల మధ్య స్పష్టమైన అవగాహనతో కూడిన పని సంస్కృతి ఉండాలి. ప్రభావవంతమైన సమర్ధతతోనే సంస్థ అభ్యుదయ పథంలో పయనిస్తుంది.
సంస్థ అభ్యున్నతి ఉద్యోగుల అభ్యుదయానికి మార్గం చూపుతుంది. యాజమాన్యసూ ఉద్యోగుల నడుమ సంబంధాలు వినియోగదారుని ఆకర్షిస్తాయి. ఆ ముగ్గురి మధ్య బంధం బలీయమైతే సమాజం అనూహ్య ప్రగతివైపు పయనిస్తుంది.