26-01-2026 02:29:44 AM
న్యూఢిల్లీ, జనవరి 25 : బీబీసీ మాజీ ప్రతినిధి, ప్రముఖ పాత్రికేయుడు సర్ మార్క్ టూలీ కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన తుదిశ్వాస విడిచారు. దశాబ్దాల కాలం పాటు భారతదేశ పరిస్థితులపై ఆయన చేసిన రిపోర్టింగ్ ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది. ‘బీబీసీ వాయిస్ ఆఫ్ ఇండియా’గా ఆయన ప్రసిద్ధి చెందారు. బ్రిటన్‌లో జన్మించినా భారత్‌ను తన సొంత ఇల్లుగా భావించారు.
తన జీవితంలో ముప్పావు వంతు కాలం ఈ దేశంలోనే గడిపారు. హిందీ భాషలో అనర్గళంగా మాట్లాడటం ఆయన ప్రత్యేకత. మార్క్ టూలీ 1965లో బీబీసీ ప్రతినిధిగా భారత్ వచ్చారు. భారత రాజకీయాలు, సామాజిక మార్పులపై లోతైన విశ్లేషణలు అందించారు. ఇందిరా గాంధీ హత్యాకాండ, భోపాల్ గ్యాస్ దురంతం, ఆపరేషన్ బ్లూ స్టార్ వంటి కీలక ఘట్టాలను ఆయన కవర్ చేశారు. 1975 ఎమర్జెన్సీ సమయంలో ప్రభుత్వం ఆయనను దేశం నుంచి బహిష్కరించింది. ఎమర్జెన్సీ ముగిసిన తర్వాత తిరిగి భారత్ చేరుకుని ఢిల్లీలో స్థిరపడ్డారు.
ఉన్నత పౌర పురస్కారాలతో సత్కారం
భారతదేశంపై ఆయనకు ఉన్న మక్కువను గుర్తించిన ప్రభుత్వం ఉన్నత పౌర పురస్కారాలతో సత్కరించింది. 1992లో పద్మశ్రీ, 2005లో పద్మభూషణ్ అవార్డులను ఆయన అందుకున్నారు. బ్రిటన్ ప్రభుత్వం కూడా ఆయనను ’నైట్ హుడ్’ బిరుదుతో గౌరవించింది. ’నో ఫుల్ స్టాప్స్ ఇన్ ఇండియా’ వంటి ప్రసిద్ధ పుస్తకాలను ఆయన రచించారు.
మార్క్ టూలీ మరణం పట్ల అంతర్జాతీయ పాత్రికేయ లోకం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. భారత రాజకీయ నాయకులు, ప్రముఖులు ఆయనకు సంతాపం తెలిపారు. భారత్, బ్రిటన్ దేశాల మధ్య వారధిలా నిలిచిన గొప్ప జర్నలిస్టును కోల్పోయామని పలువురు కొనియాడారు.